ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ వరకు ఆర్నెల్ల కాలం పూర్తైంది. ఈ ఆర్నెల్లలో ఆదాయాలు తీవ్రంగా పడిపోయిన వేళ... తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ.. వార్షిక బడ్జెట్ మధ్యంతర సమీక్షకు సిద్ధమైంది. కాగ్ నివేదిక ప్రకారం సెప్టెంబర్ నెలాఖరు వరకు తెలంగాణకి రూ. 37, 949 కోట్ల రెవెన్యూ వచ్చింది. 2020-21 ఆర్థికసంవత్సరానికి రెవెన్యూ అంచనా రూ. లక్షా 43వేల కోట్లు కాగా... ఆర్నెల్లు పూర్తయ్యే నాటికి రూ. 37, 949 కోట్లు వచ్చాయి. రెవెన్యూ అంచనాల్లో ఇది 26.51 శాతం మాత్రమే.
రూ. 31 వేలకోట్ల ఆదాయం...
గత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ వరకు 39.18 శాతం రెవెన్యూ వచ్చింది. పన్నుల ఆదాయం లక్ష్యం... రూ. లక్షా రెండు వేల కోట్లు కాగా సెప్టెంబర్ వరకు కేవలం రూ. 31,758 కోట్లు మాత్రమే వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ వరకు రూ. 38, 774 కోట్లు పన్నుల ద్వారా సమకూరాయి. పన్నుల ద్వారా సర్కార్ ఖజానాకు ఈ ఏడాది ఏప్రిల్‌లో కేవలం రూ. 1,700 కోట్లు మాత్రమే వచ్చాయి. మే నెలలో రూ. 3, 682, జూన్‌లో రూ. 6, 510, జూలైలో రూ. 6, 588, ఆగస్టులో రూ. 6,677 కోట్లు రాగా సెప్టెంబర్ నెలలో రూ. 6, 599 కోట్లు సమకూరాయి.
ఎక్సైజ్‌లో అత్యధికంగా...
పన్ను ఆదాయంలో జీఎస్టీ వాటా రూ. 10,437 కోట్లు కాగా... స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 1,657, అమ్మకం పన్ను రూపంలో రూ. 8,148 కోట్లు వచ్చాయి. ఎక్సైజ్ ఆదాయం రూ. 6,285 కోట్లు కాగా... కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా రూ. 3,753 కోట్లు. ఇతర పన్నుల రూపంలో రూ. 1, 475 కోట్లు, పన్నేతర ఆదాయం ద్వారా రూ. 1,542 కోట్లు, గ్రాంట్ల రూపంలో రూ. 4, 649 కోట్లు సమకూరాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా అత్యల్పంగా కేవలం 16.57 శాతం మాత్రమే రెవెన్యూ రాగా ఎక్సైజ్‌లో అత్యధికంగా 39.29 శాతం ఆదాయం వచ్చింది.