Sagar-Srisailam Boat journey: ఎత్తైన కొండలు.. దట్టమైన అరణ్యమార్గం. వాటిని చీల్చుతూ పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మపై ప్రయాణం. తనివితీరా ప్రకృతి అందాలను ఆస్వాదించేలా సాగే శ్రీశైల యాత్ర ఎట్టకేలకు ప్రారంభమైంది. రెండు నెలల క్రితమే ప్రారంభం కావాల్సిన నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం లాంచీకి ప్రయాణానికి పర్యాటకశాఖ అధికారులు ఉదయం 9 గంటలకు జెండా ఊపారు.
ప్రస్తుతం సాగర్ నీటిమట్టం 588.80 అడుగులు ఉండడంతో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ టూర్‌కు పచ్చజెండా ఊపింది. తొలిరోజు 10మంది యాత్రికులతో బయలుదేరిన లాంచీ.... మధ్యాహ్నం 3గంటలకు శ్రీశైల క్షేత్రానికి (Sagar And Srisailam Boat Journey timings) చేరుతుంది. రాత్రి అక్కడే బసచేసి దైవ దర్శనం, దర్శనీయ స్థలాల సందర్శన తరువాత మంగళవారం ఉదయం 9 గంటలకు శ్రీశైలం నుంచి బయలుదేరుతుంది. సాయంత్రం 3 గంటలకు లాంచీ సాగర్‌కు చేరుకుంటుందని పర్యాటక సంస్థ అధికారులు వెల్లడించారు. ఈ ప్రయాణానికి(sagar to srisailam boating) ఆదివారం సాయంత్రం వరకు 60 టికెట్లు బుక్ అయినట్లు పేర్కొన్నారు.
తొలిరోజే కాసేపు బ్రేక్
తొలి రోజు ప్రారంభమైన లాంచీని కాసేపు అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. టికెట్ డబ్బుల్లో తమకు 30శాతం చెల్లించాలని కోరారు. పర్యాటకశాఖ సిబ్బందితో చర్చల అనంతరం... లాంచీని అనుమతించారు.