మ్యూకార్‌మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) చికిత్స పొందే బాధిత కుటుంబాలను ఆర్థిక కష్టాలు కుదేలు చేస్తున్నాయి. కొవిడ్ చికిత్సకు రూ.లక్షలు ఖర్చుపెట్టి, ఈ వ్యాధి నుంచి బయటపడేందుకు మళ్లీ భారీగా సొమ్ము అవసరం కావడంతో కోలుకోలేకపోతున్నారు. అప్పులుచేస్తూ...ఉన్న కొద్దిపాటి ఆస్తులను అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోందని బాధిత కుటుంబాలు కన్నీళ్ల పర్యంతమవుతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స మరీ భారంగా మారింది.
యాంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లు దొరక్క బాధిత కుటుంబాలు హైరానా పడుతున్నాయి. బ్లాక్‌ఫంగస్ బాధితులు త్వరగా కోలుకునేందుకు అవసరమైన ఈ ఇంజెక్షన్లు మార్కెటో దొరక్క... నల్లబజారులో కొనలేక, ప్రభుత్వం నుంచి పొందాలంటే పెడుతున్న ఆంక్షలతో కుటుంబసభ్యులు అల్లాడిపోతున్నారు. ఒక్కో ఇంజెక్షన్‌కు ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.7,814. నల్లబజారులో ఒక్కోటి రూ.30-40వేలు పలుకుతోంది. ఇంజెక్షన్లు తెచ్చుకుంటేనే ఆసుపత్రిలో చేర్చుకుంటామని వైద్యులు చెబుతుండటంతో బాధిత కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
కావల్సినవి 55వేలు.. వచ్చేవి 5వేలు!
వైద్య ఆరోగ్యశాఖ అధికారుల లెక్కల ప్రకారమే జూన్ 6వ తేదీ నాటికి ఉండే రోగులందరికీ యాంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లే ఇవ్వాలంటే 55,734 డోసులు అవసరం. కానీ, అప్పటికి వచ్చేవి కేవలం 5వేలు మాత్రమే. సోమవారం వరకు ఉన్న సమాచారం ప్రకారం అందుబాటులో 3,793 యాంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లు, 826 పోసాకొనజోల్ ఇంజెక్షన్లు, 15,534 పోసాకొనజోల్ టాబ్లెట్లు ఉన్నాయి. రోజుకు 80 వరకూ కొత్త బ్లాక్‌ఫంగస్ కేసులు వస్తున్నాయి. జూన్ రెండో వారం చివరకు పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యేలా ఉంది. అప్పటికి అధికారుల అంచనా ప్రకారం 79,254 యాంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లు అవసరం అవుతుండగా కేంద్రం నుంచి వచ్చేవి 15వేలు మాత్రమే.
రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఈ ఇంజెక్షన్ల కొనుగోలుకు టెండర్లు పిలిచింది. భారత్ సీరమ్ అనే సంస్థ ముందుకొచ్చినా, కేంద్రం కేటాయించిన కోటా నుంచి మాత్రమే ఇచ్చే వీలుంది. దీంతో పెద్దగా ఉపయోగం లేదని అధికారులు భావిస్తున్నారు. కేసుల సంఖ్యను బట్టి రాష్ట్రాలకు కేంద్రం ఈ ఇంజెక్షన్లను కేటాయిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రానికి 11,605 యాంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లు వచ్చాయి. వీటిలో 11వేలు కేంద్రం నుంచి, 605 భారత్ సీరమ్ నుంచి వచ్చాయి. ఇవికాక పోసాకొనజోల్ ఇంజెక్షన్లు 1250, టాబ్లెట్లు సుమారు 50 వేలు కూడా అందినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
60 ఇంజెక్షన్లు కావాలని చెబితే జీజీహెచ్‌కు వచ్చాం
బ్లాక్‌ఫంగస్ లక్షణాలు కనిపించినందున సమీప బంధువును ముందుగా ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాను. అక్కడ పరీక్షలకు రూ.15వేల వరకు ఖర్చయింది. యాంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లను 60 వరకు తెచ్చుకుంటే చికిత్స అందిస్తామని వైద్యులు చెప్పారు. దీంతో విజయవాడ జీజీహెచ్‌లో చేర్పించాను.
కార్యాలయాల చుట్టూ తిరుగుతూ...
ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందే బ్లాక్ ఫంగస్ బాధితులకు సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో ఇంజెక్షన్లు ఇస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరితే అక్కడి వైద్యులు ఇచ్చిన సిఫార్సు లేఖ అనుసరించి జిల్లాలోని బోధనాసుపత్రి సూపరింటెండెంట్, డీఎంహెచ్‌ఓ, డీసీహెచ్‌ఎస్, ఔషధ నియంత్రణ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఇంజెక్షన్లు ఇచ్చేందుకు ప్రత్యేకంగా తయారుచేసిన దరఖాస్తుపై సంతకాలు పెడుతున్నారు. అప్పుడు జాయింట్ కలెక్టర్ రోజుకి నాలుగైదు ఇంజెక్షన్లు ఇచ్చేందుకు ఆమోదం తెలుపుతున్నారు. ఇలా రోజూ అధికారుల నుంచి సంతకాలు సేకరించి ఇంజెక్షన్లు పొందేందుకు బాధితకుటుంబాలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం.