దీపావళి పండుగ రోజున హైదరాబాద్ పాతబస్తీ కందికల్ గేట్లో విషాదం చోటుచేసుకుంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో విగ్రహాలు తయారుచేసే ఫ్యాక్టరీలో బాణాసంచా కాల్చటంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పశ్చిమబంగాల్‌కు చెందిన ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు. యూపీకి చెందిన మరో వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రుడు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
పాతబస్తీ కందికల్ గేట్ ప్రాంతంలో ఉల్లాస్ గత కొంతకాలంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ) బొమ్మలు తయారుచేసే యూనిట్‌ను నడుపుతున్నారు. దీపావళి పూజ అనంతరం ఆ యూనిట్లో పనిచేసే పశ్చిమ బెంగాల్‌కు చెందిన విష్ణు(25), జగన్(30), ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన బీరెన్(25)కు కొన్ని టపాసులను ఇచ్చి ఇంటికి వెళ్లిపోయాడు. గురువారం అర్ధరాత్రి సమయంలో టపాసులు కాలుస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి విష్ణు, జగన్‌లు అక్కడికక్కడే మృతిచెందారు. బీరెన్‌కు తీవ్రగాయాలయ్యాయి.
అర్ధరాత్రి వేళ పెద్దశబ్ధం, ఆర్తనాదాలకు ఉలిక్కిపడ్డ స్థానికులు ఛత్రినాక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న ఫలక్‌నుమా ఏసీపీ మాజిద్, ఛత్రినాక ఇన్స్పెక్టర్ ఖాదర్ జిలాని, ఫలక్‌నుమా ఇన్స్పెక్టర్ దేవేందర్‌లు పరిస్థితిని సమీక్షించారు. తీవ్రంగా గాయపడిన బీరెన్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలిలో క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించారు. ఘటనా స్థలంలోనే మృతిచెందిన విష్ణు, జగన్ మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పేలుడు గల కారణాలను పోలీసులు ఆరాతీస్తున్నారు. కేసునమోదుచేసుకున్న ఛత్రినాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.