అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో పాల డెయిరీ, చక్కెర కర్మాగారం తెరిపిస్తామన్న వైకాపా హామీ ఇప్పుడేమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చిత్తూరులో మంగళవారం బాజపా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ... చిత్తూరు జిల్లాకు చంద్రబాబు, రాయలసీమ అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్ ఏమీ చేయలేదని ఎద్దేవా చేశారు. 2024లో భాజపా అధికారంలోకి వస్తే గాలేరు-నగరి, హంద్రీనీవా, తెలుగుగంగ ప్రాజెక్టుల్ని పూర్తిచేసి సీమకు జలాల్ని అందిస్తామన్నారు. అమృత్ ద్వారా చిత్తూరుకు రూ.250 కోట్లు మంజూరు చేసినా.. తాగునీటి కోసం కనీసం పైప్ లైన్ వేయలేకపోయారని విమర్శించారు.
భూసర్వే కేంద్ర పథకం...
సమగ్ర భూసర్వే కేంద్ర పథకమని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వ పథకం ప్రచారం చేసుకోవడం విచిత్రంగా ఉందన్నారు. అప్పులు చేసి రాష్ట్ర పరిపాలన సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. మద్యం విక్రయాలు, భూమి కొనుగోలులో అవినీతి జరిగిందన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ విచ్చలవిడిగా సాగుతోందని ఆరోపించారు. పసుపు కుంకుమ అంటూ చంద్రబాబు, నవరత్నాలు అంటూ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ధ్వజమెత్తారు.