గ్రేటర్ హైదరాబాద్ మన్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో భాజపా గెలవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. దీనికోసం భాజపాకు పూర్తి మద్దతు ఇస్తున్నామని పవన్ ప్రకటించారు. ఒక్క ఓటు కూడా బయటకు వెళ్లకుండా చూడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్‌తో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా సీనియర్ నేత లక్ష్మణ్ సమావేశమయ్యారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తాజా పరిస్థితులపై చర్చించారు. అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల నుంచి వైదొలుగుతున్నాం. భాజపాకు పూర్తి మద్దతు ఇస్తున్నాం. రెండు పార్టీలు కలిసే పోటీచేయాలని అనుకున్నా కరోనా పరిస్థితులు, అనూహ్యంగా వచ్చిన ఎన్నికలతో సాధ్యం కాలేదు. ఏపీ, తెలంగాణలో భాజపాతో కలిసి పని చేస్తున్నాం. ప్రధాని మోదీ నాయకత్వంలో హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోంది. హైదరాబాద్‌లో బలమైన నాయకత్వం ఉండాల్సిన అవసరముంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో పాటు తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ భాజపా గెలవాలి- పవన్ కల్యాణ్