జీహెస్ఎంసీ ఎన్నికల నగారా మోగడంతో కమలదళం గ్రేటర్ అభ్యర్థుల ఎంపిక కసరత్తును ముమ్మరం చేసింది. బుధవారం తొలి జాబితాను ప్రకటించాలని నిర్ణయించింది. మరోవైపు తెరాస, కాంగ్రెస్‌లోని బలమైన నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు భాజపా నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించిన రోజే మొదటి జాబితా ప్రకటించాలని తొలుత భాజపా అనుకున్నా మంగళవారం కొలిక్కి రాలేదు. గ్రేటర్ పరిధిలో పార్టీ జిల్లా శాఖల వారీగా సమావేశాలు నిర్వహించి ఆశావహుల జాబితాను వడపోశారు. గ్రేటర్ ఎన్నికల ఇన్‌ఛార్జ్, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ బుధవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ఆయన రాగానే ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించి తొలి జాబితాను ఖరారు చేయాలని భాజపా నిర్ణయించింది. మరోవైపు జాతీయ నాయకత్వం గ్రేటర్ ఎన్నికల కోసం ప్రకటించిన ఐదుగురు ఇన్‌ఛార్జుల్లో కర్ణాటకకు చెందిన మంత్రి సుధాకర్, ఎమ్మెల్యే సతీశ్‌రెడ్డి మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు.
గ్రేటర్ పోరుకు సమన్వయకర్తలు..
జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు కమలదళం గ్రేటర్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నేతలకు బాధ్యతలు అప్పగించింది. 24 అసెంబ్లీ స్థానాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల్ని సమన్వయకర్తలుగా నియమించింది. డివిజన్ల వారీగా కూడా ఇతర నేతలను బాధ్యులుగా నియమించింది. మేనిఫెస్టో కమిటీకి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, ప్రచార కమిటీకి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బహిరంగ సభలకు బంగారు శృతి, ఫైనాన్స్ అకౌంట్స్ కమిటీకి వివేక్ వెంకటస్వామి, ఎన్నికల సంఘం, న్యాయపరమైన అంశాలకు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, మీడియా కమిటీకి ధర్మపురి అర్వింద్‌ను ఇన్‌ఛార్జిగా నియమించింది. ఏపీకి చెందిన ఓటర్లను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. దీనికి ఇన్‌ఛార్జిగా మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు, సహ ఇన్‌ఛార్జులుగా సీఎం రమేశ్, డాక్టర్ పద్మ, సుమంతిరెడ్డి, సుహాసినిరెడ్డి, డాక్టర్ నిర్మలదేవిని నియమించింది.