BJP Padayatra in Amaravati: రాజధాని అమరావతి నిర్మాణానికి ముఖ్యమంత్రిపై కేంద్రం ఒత్తిడి తేవాలని రాజధాని రైతులు కోరారు. 'మనం-మన అమరావతి' పేరిట భాజపా చేస్తున్న పాదయాత్రలో అమరావతి రైతులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణం ప్రారంభిస్తే.. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి రాజధానిలో నిర్మాణాలు ప్రారంభిస్తారని అభిప్రాయపడ్డారు. వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటినుంచి తమను రోడ్డున పడేసిందని.. అందుకే అమరావతి పేరుతో ఎవరు ముందుకువచ్చినా తాము స్వాగతిస్తున్నట్లు రైతులు స్పష్టం చేశారు. కేవలం పాదయాత్రతో సరిపెట్టకుండా అమరావతిని నిర్మించే వరకూ భాజపా సహకరించాలని కోరారు. ఇవాళ్టి పాదయాత్రలో భాజపా మహిళా నాయకురాలు సాధినేని యామిని పాల్గొన్నారు. అమరావతి రాష్ట్ర ప్రజలందరి రాజధాని కాబట్టి అందరూ పోరాడాలన్నారు.
Amaravati farmers: రాజధాని గ్రామాల్లో భాజపా పాదయాత్ర 6వ రోజు నెక్కల్లు నుంచి ప్రారంభమైంది. ఇవాళ్టీ పాదయాత్రకు భాజపా అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మల కిషోర్, మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి యామిని హాజరయ్యారు. భాజపా నేతలు పాటిబండ్ల రామకృష్ణ, జయప్రకాష్ నారాయణ పాదయాత్ర చేస్తున్నారు. రాజధాని విషయంలో ముఖ్యమంత్రి రాక్షసానందం పొందుతున్నారని భాజపా అధికార ప్రతినిధి భాను ప్రకాష్ విమర్శించారు. రైతులతో పెట్టుకుంటే మాడి మసై పోతారని హెచ్చరించారు. అమరావతే రాజధానిగా ప్రకటించే వరకూ పోరాటం చేస్తామన్నారు.