Somuveeraju: రాష్ట్ర ఆర్థిక స్థితి బాగుంటే రాజధాని ఎందుకు కట్టడంలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు ప్రశ్నించారు. గుంటూరు జిల్లా భాజపా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ అమరావతిలో చేపట్టిన పాదయాత్రను సోమువీర్రాజు ప్రారంభించారు. 'మనం-మన అమరావతి' పేరుతో పాదయాత్ర సాగనుంది. ఆగష్టు 4వ తేదీ వరకు రాజధాని గ్రామాల్లో నేతలు పాదయాత్ర చేయనున్నారు. మొదటి రోజు పాదయాత్ర ఉండవల్లి నుంచి పెనుమాక, కృష్ణాయపాలెం, యర్రబాలెం వరకు కొనసాగనుంది.
రాష్ట్ర ప్రజలకు రాజధాని లేకుండా చేశారని, ఇందుకు వైకాపాతో పాటు తెదేపా కూడా కారణమేనని సోమువీర్రాజు ఆరోపించారు. వెంకయ్యనాయుడు రాజధాని కోసం రూ.2,500 కోట్లు నిధులు ఇప్పించారని... రాజధాని కుట్టకుండా రెండు పార్టీలు రైతులను మోసం చేశాయన్నారు. అమరావతిలో నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలని, రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సోమువీర్రాజు డిమాండ్‌చేశారు. రాజధాని కోసం తీసుకున్న భూముల్లో ఏమేం చేస్తారో వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.
రాజధాని విషయంలో కేంద్రం ఎక్కడా మోసం చేయలేదన్న సోమువీర్రాజు... ఎయిమ్స్, వ్యవసాయ విశ్వవిద్యాలయం, బైపాస్ రహదారులు, ప్లై ఓవర్లు నిర్మించామని తెలిపారు. రాజధానిలో అంతర్గత రహదారులు, డ్రైనేజ్ నిర్మాణం కూడా కేంద్రం చేపడుతోందన్నారు. మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేయటంలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వం రాజధానిని నిర్మించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదికాదని అన్నారు. గత ముఖ్యమంత్రి వైకాపా ఉచ్చులో పడకుండా ఉంటే బాగుండేదన్నారు.