ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జగన్‌కు పాలనపై అవగాహన లేదు: సత్యకుమార్‌

ముఖ్యమంత్రి జగన్​కు పరిపాలనపై అవగాహన లేదని భాజపా జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ అన్నారు. అమరావతిలోని రాజధాని ఉండాలనేది భాజపా వైఖరి అని సత్యకుమార్‌ స్పష్టం చేశారు.

BJP national secretary Y Satyakumar
భాజపా జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్

By

Published : Sep 28, 2020, 8:26 AM IST

Updated : Sep 28, 2020, 11:54 AM IST

‘సీఎం జగన్‌కు పాలనపై అవగాహన లేదు.. ఒక్క ప్రాజెక్టూ చేపట్టలేదు, వచ్చినప్పటి నుంచి రివర్స్‌ టెండరింగ్‌, పీపీఏల రద్దు తదితర అవగాహనారాహిత్యమైన పనులు తప్పితే రాష్ట్రానికి ఉపయోగపడేదేం చేయలేదు’ అని భాజపా జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్‌ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎస్సీలపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నా కేసులు పెట్టే పరిస్థితి లేదని విమర్శించారు. ‘వైకాపా, తెలుగుదేశం పార్టీలు రెండూ మాకు రాజకీయ శత్రువులే. ఆ నేతలిద్దరూ కాంగ్రెస్‌ అవినీతి వటవృక్షం నుంచి మొలకెత్తినవారే.. ఆ రెండు పార్టీలతో సమదూరం పాటిస్తాం. జనసేనతో కలిసి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నాం’ అని స్పష్టం చేశారు. పార్టీ కార్యదర్శిగా రెండోసారి నియమితులైన ఆయన ఆదివారం ‘ఈనాడు’తో మాట్లాడారు.

  • రాజధానిపై రాజకీయాలు చేస్తున్నారు

‘అమరావతిలోనే రాజధాని ఉండాలనేది భాజపా వైఖరి. రైతులు ముందుకు వచ్చి భూములిచ్చారు కాబట్టే.. కేంద్రం వారికి క్యాపిటల్‌ గెయిన్స్‌ పన్ను మినహాయింపు ఇచ్చింది. రాజధాని ఎక్కడ పెట్టాలనేది కేంద్రం పరిధిలో లేదు. చంద్రబాబు, జగన్‌ ఇద్దరూ వ్యక్తిగత కక్షల కోసం రాజకీయాలు చేస్తున్నారు.

  • అన్యాయంపై గళమెత్తే వ్యక్తి పవన్‌ కల్యాణ్‌

పవన్‌ కల్యాణ్‌ది ప్రశ్నించే నైజం. అన్యాయంపై గళమెత్తే వ్యక్తి. ఆయన రెండు పార్టీల ధన, కుల బలం ముందు తట్టుకోలేకపోయారు. మా ఇద్దరి ఆలోచనలు ఒకే విధంగా ఉన్నాయి. ఆయన ప్రజాదరణ, మా పార్టీ సంస్థాగత నిర్మాణం కలిస్తే తిరుగులేని శక్తిగా ఎదుగుతాం. రాష్ట్రంలో ఇప్పటికే మేం బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. ఇసుక, మద్యం, ఆలయాలపై దాడుల విషయంలో ఉద్యమిస్తున్నాం. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాం.

  • ‘‘ఆలయాలపై దాడులు యాదృచ్ఛికంగా జరిగినవేం కావు. పది నెలల నుంచి వరుసగా జరుగుతుంటే ఒక్కరినీ గుర్తించలేదు. ఇంటెలిజెన్స్‌ పని చేయడం లేదా? అలసత్వమా? అంతర్వేదిలో నిరసన చేసే సమయంలో ప్రార్థనా మందిరంపై రాళ్లు వేశారని 43 మందిపై కేసులు పెట్టారు. ఇక్కడి క్రియాశీలత అక్కడెందుకు చూపడం లేదు. సాక్షాత్తూ ప్రధాని మోదీపైనే అభ్యంతరకర భాష వాడటం ఏమిటి? అలాంటి వారిపై సీఎం చర్యలు తీసుకోవాలి. పదేపదే అలా అంటున్నారంటే సీఎంకు తెలియదనుకోవాలా?’’

ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన పాలకులు మీరు.. ఏ రాజ్యాంగం ద్వారా సీఎం అయ్యారో.. అలాంటి రాజ్యాంగబద్ధ సంస్థల్ని గౌరవించాలి. నిర్వీర్యం చేసే ప్రయత్నం చేయకూడదు. అలా చేస్తే మొత్తం వ్యవస్థ కుప్పకూలుతుంది. రాష్ట్రంలో మంత్రులు, అత్యున్నత స్థాయిలోని వ్యక్తులు న్యాయస్థానాలను లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం మంచిది కాదు. న్యాయవ్యవస్థపై గౌరవం పోతే.. రేపు శాసన వ్యవస్థ మీదా గౌరవం పోతుంది. పాలన, శాసన, న్యాయ, మీడియా వ్యవస్థలకు జవాబుదారీ తనం ఉండాలి. సమ న్యాయంతో పని చేయాలి. వాటి ప్రమాణాలు పెంచేందుకు మనం పని చేయాలి.

‘‘కరోనా సమయంలో పీపీఈ కిట్లు అడిగితే ఏం చేశారో చూశాం. వ్యక్తులపై అంత కక్ష సాధింపు ధోరణి ఏంటి? వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తాం.. ప్రజాధనాన్ని రంగుల కోసం వృథా చేస్తాం అంటే ఎలా? మద్యం, ఇసుకలో అవినీతి కనిపించడం లేదా? అయినా సీఎం సమీక్షించడం లేదు. ఎమ్మెల్యేల స్థాయిలో విపరీతమైన అవినీతి జరుగుతోంది. అవినీతిపై ప్రశ్నించే ప్రజలను అణచివేస్తున్నారు’’

  • ప్రశ్నిస్తే మతతత్వం అంటారా?

మేమెక్కడా మతపరమైన రాజకీయాలు చేయలేదు.. ఎవర్నీ బుజ్జగించం. అందరికీ సమన్యాయం చేయాలనేదే మా లక్ష్యం. ఆలయాలకు భక్తులిచ్చిన డబ్బుల్ని మళ్లిస్తాం అంటే అంగీకరించం. భాజపా సీఎంలున్న రాష్ట్రాల్లో ఎక్కడా కుల రాజకీయం చేసి అధికారంలోకి రాలేదు. ప్రశ్నిస్తే మతతత్వం అంటారు. వాళ్లేమో మతానికి రిజర్వేషన్లు కల్పిస్తామంటారు. మత మార్పిడుల్ని ప్రోత్సహిస్తారు. ఒక మతానికి సంబంధించిన వారికి జీతాలిస్తామంటారు.

  • వ్యవసాయ బిల్లులతో రైతులకు లాభం..

వ్యవసాయ బిల్లులతో రైతుల జీవన ప్రమాణాలు మారిపోతాయి. ప్రభుత్వాలు, దళారుల పెత్తనం తగ్గుతుంది. రైతులు తమ పంటను ఎక్కడైనా నచ్చిన ధరకు అమ్ముకోవచ్చు. మార్కెట్‌కు వెళ్లి పన్ను కట్టాల్సిన పనిలేదు. రవాణా ఖర్చులు ఉండవు, దళారులూ ఉండరు. అలాగని మార్కెట్‌ కమిటీలు తీసేయరు. అక్కడైనా అమ్ముకోవచ్చు. మద్దతు ధర కూడా తీసేయరు’.

‘‘ఏపీలో ఇప్పుడు తెచ్చే అప్పుల్లో సింహభాగం అనుత్పాదక వ్యయానికే. జీఎస్‌డీపీని పెంచే ప్రయత్నం చేయడం లేదు. తలసరి ఆదాయం పెంచాల్సింది పోయి తలసరి అప్పు పెంచుతున్నారు. అరకొర నిధులిచ్చి ప్రజల్ని మభ్య పెడుతున్నారు. సబ్‌ ప్లాన్‌ నిధులు మళ్లిస్తున్నారు’’.

ఇదీ చదవండి:

వైకాపాకు ప్రజలే బుద్ధి చెబుతారు: దగ్గుబాటి పురందేశ్వరి

Last Updated : Sep 28, 2020, 11:54 AM IST

ABOUT THE AUTHOR

...view details