అమరావతిలోనే రాజధానిని కొనసాగేలే చూసేందుకు ఎందాకైనా పోరాడతామని భాజపా ఎంపీ సుజనా చౌదరి తెలిపారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే రాజధానిగా అమరావతిని గతంలో ఎంపిక చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం అమరావతిలో 52 వేల 837 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 62 ప్రాజెక్టులు మొదలయ్యాయని తెలిపారు. వీటిలో 42 వేల 170 కోట్ల పనులకు టెండర్లు కూడా ఖరారైనట్లు వివరించారు. అయితే వైకాపా అధికారంలోకి వచ్చాక నిర్మాణ పనులు నిలిపివేశారని... ఇందుకు తోడు సీఎం అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రతిపాదన చేయటం ఆశ్చర్యం కలిగించిందనీ చెప్పారు. ఇప్పటికిప్పుడు రాజధానిని మార్చటం అంటే న్యాయపరమైన చిక్కులు, ఆర్థిక అవస్థల్ని కొని తెచ్చుకోవటమేనని అన్నారు. ఈ విషయాలపై.. ముఖ్యమంత్రికి సుజనా చౌదరి లేఖను పంపారు.
తాను ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా గత ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినట్లు మంత్రులు చేస్తున్న విమర్శలను సుజనా తప్పుబట్టారు. రాజధాని కోసం భూసమీకరణ చేసిన దాంట్లో... వైకాపా నేతలు అక్రమాలు జరిగినట్లు చెబుతున్న 4వేల 75 ఎకరాలు.. కేవలం 12 శాతం మాత్రమేనని వివరించారు. అక్రమాలు జరిగాయని భావిస్తే పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రస్తుత చట్టాల ప్రకారం శిక్షించటం సాధ్యం కాకపోతే దిశ మాదిరిగా కొత్త చట్టం తీసుకురావాలని సూచించారు.