Laxman on CM KCR National Party: తెరాస అధినేత, సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని స్వాగతిస్తున్నామని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ఏపీలో ఎలాంటి అభివృద్ధి జరగట్లేదని.. అక్కడి ప్రజలు భాజపా ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పవన్‌కల్యాణ్‌తో కలిసి పోటీ చేస్తామని స్పష్టం చేశారు. తెదేపాతో పొత్తు అనేతి కేవలం ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణలోనే అధికారంలోకి వస్తామన్నారు.
కాంగ్రెస్.. తెలంగాణలోనే కాదు దేశంలో ఎక్కడా లేదని లక్ష్మణ్ అన్నారు. భాజపాలో చేరేందుకు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. సమయం, అవసరాల రీత్యా కొందరు తెరాసలో కొనసాగుతున్నారని వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో సర్పంచ్, ఎంపీటీసీలు భాజపాలో చేరుతున్నారని లక్ష్మణ్ తెలిపారు. భాజపా పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా నియమించడమే కేంద్రమంత్రి పదవిగా భావిస్తున్నట్లు తెలిపారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తర్వాత పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా నియమితులైన రెండో వ్యక్తిని తానేనని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.