అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేయడంపై భాజపా శాసనసభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. తమ సస్పెన్షన్ రాజ్యాంగానికి, సభ నియామవళికి విరుద్ధంగా ఉందంటూ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్, రాజాసింగ్ పిటిషన్ దాఖలు చేశారు. సస్పెన్షన్ కొట్టివేసి సమావేశాలకు అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని భాజపా ఎమ్మెల్యేలు కోరారు. సస్పెన్షన్ తీర్మానంతో పాటు నిన్నటి సమావేశాల వీడియో రికార్డింగులను తెప్పిచడంతో పాటు తమకూ ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించాలని కోరారు.
రాజకీయ వైరుద్ధ్యాల కారణంగా
ముందస్తు ప్రణాళికతో తమను సభ నుంచి సస్పెండ్ చేశారని ఎమ్మెల్యేలు అన్నారు. కేంద్రం, భాజపాలపై రాజకీయ వైరుద్ధ్యాల కారణంగా గవర్నర్‌ను సభకు ఆహ్వానించలేదని.. దానిపై నిరసన మాత్రమే వ్యక్తం చేశామని పిటిషన్లో వివరించారు. తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరామని తెలిపారు. స్పీకర్ దృష్టిని ఆకర్షించేందుకు రాజాసింగ్ కొంత ముందుకు వెళ్లారని... సభలో ఇలా అడగటం మొదటిసారేమీ కాదని పేర్కొన్నారు. సభ నడవలేని పరిస్థితి తలెత్తినప్పుడు లేదా స్పీకర్ను కించపరిచేలా వ్యవహరిస్తే సస్పెండ్ చేయవచ్చునని.. ఆ రెండూ జరగలేదని చెప్పారు.
ముందుగా రాసిచ్చిన తీర్మానం చదివి
స్పీకర్ పేర్కొన్న సభ్యులను మాత్రమే సస్పెండ్ చేయాలన్న నిబంధన పాటించలేదని.. సభాపతి తమను ముందుగా హెచ్చరించలేదని కనీసం పేరు కూడా పలకలేదన్నారు. ఆర్థిక శాఖ మంత్రి అకస్మాత్తుగా ప్రసంగం ఆపడం.. తర్వాత మంత్రి తలసాని... ముందుగా రాసిచ్చిన తీర్మానం చదవడం.. మెజారిటీ ద్వారా ఆమోదం తెలపడం నిమిషాల్లో అయిపోయాయని వివరించారు. మరోవైపు సభను కేవలం ఆరు పని రోజులకే పరిమతం చేశారన్నారు. భాజపా ఎమ్మెల్యేల పిటిషన్పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.