ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 8, 2021, 5:57 PM IST

ETV Bharat / city

Agitations: రైతు సమస్యలపై.. రాష్ట్ర వ్యాప్తంగా భాజపా నేతల నిరసనలు

వైకాపా ప్రభుత్వం వచ్చిననాటి నుంచి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై భాజపా నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర, పంట కొనుగోలు, స్థిరీకరణ నిధి, రైతు భరోసా.. ఇతర సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారి డిమాండ్​ చేశారు. జగన్మోహన్​ రెడ్డికి అన్నదాతలపై, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై.. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు చూపించిన శ్రద్ధ ఇప్పుడు ఏమైందని వారు ప్రశ్నించారు.

bjp leaders agitations over farmers problems
రాష్ట్ర వ్యాప్తంగా భాజపా నేతల నిరసనలు

కృష్ణా జిల్లాలో..

రైతు భరోసా కేంద్రాలు.. రైతు భక్షక కేంద్రాలుగా మారుతున్నాయని భాజపా రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం విజయవాడలో ధ్వజమెత్తారు. అన్నదాతల సమస్యలపై కనీసం సీఎం సమీక్ష కూడా నిర్వహించడంలేదని ఆరోపించారు. మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయడం లేదని.. మిల్లర్ల కబంధ హస్తాల్లో అన్నదాతలు విలవిలలాడుతున్నారని.. కుంటి సాకులతో రైతులకు ఇవ్వాల్సిన మొత్తాల్లో కోత విధిస్తున్నారని ఆరోపించారు. రైతు భరోసా కేంద్రాల్లో వివరాలు నమోదు చేసుకుని నెలరోజులు దాటినా.. ఇంతవరకూ కొనుగోళ్లు జరగలేదని జొన్న రైతులు వాపోయారు. బీపీటీ రకం వరి సాగు చేసిన రైతుల నుంచి కొనుగోళ్లు లేవని మరికొందరు రైతులు భాజపా నేతల ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు.

గుంటూరు జిల్లాలో..

రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రివర్స్​లో నడుస్తోందని.. భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ విమర్శించారు. రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. గుంటూరులోని నివాసంలో నిరసన దీక్ష చేపట్టారు. పథకాలపేరుతో ప్రజలకు సొమ్ము పంచిపెడుతూ.. ప్రభుత్వం అన్నదాతలను గాలికొదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్దతు ధర కోసం రూ. 3 వేల కోట్లతో నిధి ఏర్పాటు చేస్తానని చెప్పి కేవలం రూ. 500 కోట్లు కేటాయించారన్నారు. నీటిపారుదల ప్రాజెక్ట్ లపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ పరికరాలను రైతులకు అందించడంలేదని అన్నారు.

అన్నదాతలకు రైతు భరోసా కింద రూ. 13,500 ఇస్తామని మాటతప్పారని పట్టణ అధ్యక్షుడు రమేశ్​ ఆక్షేపించారు. రైతుల నుంచి కొన్న ధాన్యానికి మూడు నెలలైనా చెల్లింపులు చేయడం లేదని.. చాలా చోట్ల అసలు కొనుగోళ్లు కూడా లేవని ఆరోపించారు.

తూర్పు గోదావరి జిల్లాలో..

అమలాపురం డివిజన్ వ్యాప్తంగా భాజపా నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్ రైతుల సంక్షేమానికి చేసిందేమీ లేదని వారు విమర్శించారు. కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ.. వారు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

కడప జిల్లాలో..

రైతుల పట్ల వైకాపా ప్రభుత్వం మొసలి కన్నీరు కారుస్తోంది.. భాజపా కిసాన్ మోర్చా జాతీయ సభ్యులు రామచంద్ర రెడ్డి ధ్వజమెత్తారు. కడపలో భారతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. రైతు భరోసా కేంద్రాలు.. వైకాపా కార్యకర్తలకు పార్టీ నిలయాలుగా మారాయని వాటివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఆరోపించారు. రివర్స్​ టెండర్ల పేరుతో ప్రాజెక్టులన్నింటినీ.. తిరోగమనంలో తీసుకెళ్లారని ఆరోపించారు. ఇలాగైతే ప్రాజెక్టులు పూర్తికి 100 ఏళ్ల సమయం పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు సగం ధాన్యాన్నే రైతుల నుంచి కొనుగోలు చేసిందన్న ఆయన.. అన్నదతలను నిర్లక్ష్యం చేస్తే ఉద్యమాలు తప్పవరి హెచ్చరించారు.

చిత్తూరు జిల్లాలో..

ప్రభుత్వం మిల్లర్లతో లాలూచీపడి రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని.. భాజపా రాష్ట్ర మీడియా ప్రతినిధి కోలా ఆనంద్ అన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ.. శ్రీకాళహస్తిలోని నివాసంలో వరి ధాన్యం రాశిగా పోసి నిరసన కార్యక్రమం చేపట్టారు. వైకాపా రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటూ.. వారికి తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపించారు.

అనంతపురం జిల్లాలో..

ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డిది రైతు ద్రోహ ప్రభుత్వమని.. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అనంతపురంలో పార్టీ నేతలు ఇంటివద్దనే రైతు దీక్షలు నిర్వహించిన ఆయన.. జగన్​ ప్రతిపక్షంలో ఉన్నపుడు రాష్ట్రంలోని 86 లక్షల మంది రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 45 లక్షల మందే రైతులు ఉన్నట్లు చూపుతూ మిగిలిన వారిని మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు గడిచినా.. రైతులకు ఒక్క మీటరు డ్రిప్ పైపు కూడా ఇవ్వలేదని విమర్శించారు. రైతులకోసం కేటాయించిన ధరల స్థిరీకరణ నిధిని ఏ బ్యాంకులో డిపాజిట్​ చేశారో చెప్పాలన్నారు.

హిందూపురంలో భాజపా ఆధ్వర్యంలో రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎవరి ఇళ్లలో వారు నిరసన కార్యక్రమాన్ని ఏకకాలంలో నిర్వహించారు. ఇటీవల వర్షానికి తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

Wuhan Lab: అమెరికాకు ఏడాది క్రితమే తెలుసా?

పేదవాడికి ఉపయోగపడని ప్రభుత్వాలు.. ఫెయిల్ అయినట్లే: సీఎం

ABOUT THE AUTHOR

...view details