వైకాపా పాలనలో అభివృద్ధి కుంటుపడిందని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ప్రధాన రహదారుల దుస్థితిపై శనివారం 'రహదారుల దిగ్బంధం' కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. కేంద్రం ఇచ్చే నిధులను పక్కదారి పట్టించేందుకు వైకాపా ప్రాధాన్యత ఇస్తోందని ఆయన ఆరోపించారు.
భీమవరంలో రోడ్ల నిర్వహణకు 12సార్లు టెండర్లు పిలిస్తే ఒక్కరు కూడా ముందుకు రాలేదన్నారు. పీఎంజీవై ద్వారా 723 కోట్ల రూపాయలు ఇస్తే.. దారి మళ్ళించారని ఆరోపించారు. సంబంధిత శాఖ నుంచి యూటిలైజేషన్ సర్టిఫికెట్ రాకపోవడంతో నిధులు ఆగిపోయాయన్నారు. బ్యాంకులు కూడా ఏపీకి డబ్బులు ఇవ్వాలంటే భయపడుతున్నాయన్నారు. ఆర్థిక మంత్రి సొంత గ్రామంలో కాంట్రాక్టర్లు నిరసనకు దిగారని గుర్తు చేశారు. పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున రహదారుల దిగ్బంధం కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.