‘మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఏపీ ఎన్నికల సంఘం పూర్వ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌లతో నా సమావేశాల్ని రాజకీయాలకు ముడిపెట్టి మాట్లాడేవారు వారి నేలబారు మనస్తత్వాన్ని బయట పెట్టుకున్నట్టే. నలుగురు కలసి మాట్లాడుకుంటే కుట్రలు చేయడమే అనుకోవడం వారి దిగజారిన స్థాయిని తెలుపుతుంది. కామినేని, రమేశ్ కుమార్ వేర్వేరు అంశాలపై విడివిడిగా నన్ను కలిశారు. అవి సాధారణ సమావేశాలే. కొన్ని మీడియా సంస్థలు, రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నట్టు ఎవరినో ఏదో చేయడానికి కాదు’ అని భాజపా నాయకుడు, వై.సుజనా చౌదరి మంగళవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ‘లాక్‌డౌన్ తర్వాత నా అధికార, వ్యాపార కార్యకలాపాల్ని పార్క్ హయత్ హోటల్ నుంచే నిర్వహిస్తున్నా. ఈ నెల 13న కామినేని నన్ను కలవడానికి అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. అదే రోజు రమేశ్ కుమార్ నన్ను కలుస్తానని అడిగారు. కామినేనితో రాష్ట్రంలో పార్టీ వ్యవహారాల గురించి మాట్లాడా. ఆయన వెళ్లాక రమేశ్ కుమార్ కలిశారు. ఆయన మా కుటుంబానికి చిరకాల మిత్రులు. ఆయనతో ఇటీవలి పరిణామాల గురించిగానీ, ఆయన విధి నిర్వహణకు సంబంధించిన అంశాల్నిగానీ చర్చించలేదు’ అని సుజనా పేర్కొన్నారు.
ఇదే అంశంపై కామినేని ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. పార్క్ హయత్ హోటల్ రహస్య ప్రదేశమేమీ కాదని, తాను అందరి ముందే వెళ్లి సుజనా చౌదరితో మాట్లాడి వచ్చానని, దాన్ని దొంగల సమావేశం అని ఎలా అంటారని ఆయన మండిపడ్డారు.
నేను నా పని చూసుకుని వచ్చేశా: కామినేని