రాజధాని అమరావతిపై నీ వైఖరేంటి జగన్ ? - bjp
రాజధాని విషయంలో సీఎం జగన్ తన వైఖరి వెల్లడించాలని భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఇప్పటికే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని...అమరావతి రాజధానిగా ఉండాలన్నదే తమ అభిప్రాయమని స్పష్టం చేశారు.
రాజధాని అమరావతి విషయంలో ముఖ్యమంత్రి జగన్ తన వైఖరిని స్పష్టం చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణానికి ఇప్పటికే వేల కోట్ల రూపాయలు వెచ్చించారన్న లక్ష్మీనారాయణ..... రాజధాని ఇక్కడ ఉండాలన్నదే తమ భావన అని తెలిపారు. అమరావతికి భూములిచ్చిన రైతులు కొందరు గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణను కలిశారు. మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయని, రాజధానిలో పనులు పూర్తిగా ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు కౌలు కూడా ఇవ్వడం లేదని వాపోయారు. రాజధానిని అమరావతి నుంచి మార్చకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కోసం 3 పంటలు పండే పొలాలను త్యాగం చేసిన రాజధాని రైతులకు భాజపా అండగా ఉంటుందని కన్నా వారికి హామీ ఇచ్చారు..