ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వైకాపా సర్కార్‌ రైతులను పట్టించుకోవడం లేదు'

నివర్ తుపాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలమైందని భాజపా-జనసేన నాయకులు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్​లో సమావేశమైన ఇరు పార్టీల ముఖ్య నేతలు పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో రహదారుల పరిస్థితి, ఏలూరు ఘటన, ఈడబ్యూఎస్ రిజర్వేషన్ల అమలుతో పాటు తిరుపతి లోక్​సభ ఉపఎన్నికపై నేతలు సమాలోచనలు చేశారు.

BJP_JANASENA
BJP_JANASENA

By

Published : Dec 8, 2020, 5:31 PM IST

Updated : Dec 9, 2020, 5:07 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో నివర్‌ తుపాను వల్ల బాగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జనసేన, భాజపా నేతల సంయుక్త సమావేశం విమర్శించింది. రైతులకు తక్షణ సాయం, వారు కోరుతున్న పరిహారం అందించడంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కనబరుస్తోందని ఉభయ పార్టీల నాయకులూ అభిప్రాయపడ్డారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ నివర్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు రైతుల వేదన బయటపడిందని వారు పేర్కొన్నారు. రైతుల్లో ఉన్న నిరాశను పోగొట్టవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆ పార్టీల నాయకులు అన్నారు. హైదరాబాద్‌లో మంగళవారం జనసేన-భాజపా ముఖ్య నాయకులు సమావేశమై రాష్ట్రంలోని తాజా పరిస్థితులను చర్చించారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి వి.సతీష్‌, ఏపీ కో ఇన్‌ఛార్జి సునీల్‌ దేవధర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుకర్‌ సమావేశంలో పాల్గొన్నారు.

రహదారుల నిర్వహణ విస్మరించారు
ముఖ్యమంత్రి జగన్‌ అసమర్థ విధానాలు, పాలన వైఫల్యాలతో రహదారుల నిర్వహణ, నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించడంపై, రహదారుల దుస్థితిపై భాజపా చేపట్టిన ఆందోళనపైనా సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో ఛిద్రమైన రహదారుల వల్ల సామాన్యుల రోజువారీ జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతోందని..అత్యవసర వైద్య సేవల కోసం గ్రామాల నుంచి పట్టణాలకు రావాలన్నా చాలా ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడిందని భాజపా నాయకులు విమర్శించారు. ఏలూరు నగరంలో అంతుబట్టని అనారోగ్య సమస్యలతో ప్రజలు పడుతున్న ఆందోళనపై విచారం వ్యక్తం చేశారు. సమస్య తీవ్రత దృష్ట్యా కేంద్ర బృందాలను ఏలూరుకు పంపి పరిస్థితిని అధ్యయనం చేసి, విచారణ చేయించాలని ప్రధాని మోదీని కోరాలని సమావేశం నిర్ణయించింది. రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి వర్తింపజేయాల్సిన రిజర్వేషన్లు అమలు చేయడం లేదని, రాష్ట్రంలో వాటిని అమలు చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రెండు పార్టీలూ నిర్ణయించాయి. పథకాల అమలు, ఆర్థికాభివృద్ధికి దోహదం చేసే కార్యక్రమాల అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దీంతో ప్రధానంగా రాయలసీమలో యువత ఇబ్బంది పడుతున్నారని నాయకులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను విశ్లేషించుకుని తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికీ, ఎమ్మెల్సీ స్థానాలకూ అభ్యర్థుల ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నారు.

Last Updated : Dec 9, 2020, 5:07 AM IST

ABOUT THE AUTHOR

...view details