ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Bjp leader Laxman లక్ష్మణ్‌కు భాజపాలో కీలక స్థానం - latest news about bjp leders

Bjp leader Laxman పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే పార్లమెంటరీ బోర్డులోకి భాజపా ఎంపీ కె. లక్ష్మణ్​కు అధిష్ఠానం స్థానం కల్పించింది. తెలంగాణ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యం, సామాజిక సమీకరణాల కోణంలో కమలదళం ఆయన్ను వ్యూహాత్మకంగానే బోర్డులోకి తీసుకుందని పార్టీ వర్గాల సమాచారం.

Bjp leader Laxman
కె.లక్ష్మణ్‌కు

By

Published : Aug 18, 2022, 3:11 PM IST

Bjp leader Laxman భాజపాలో అత్యున్నత నిర్ణయాత్మక మండలి పార్లమెంటరీ బోర్డులో తెలంగాణకు తొలిసారి నేరుగా ప్రాతినిథ్యం లభించింది. పార్టీ అధిష్ఠానం సీనియర్‌ నేత కె.లక్ష్మణ్‌కు ఈ మేరకు అవకాశం కల్పించింది. 2020 అక్టోబరులో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఆయన్ను నియమించిన అధిష్ఠానం.. ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి రాజ్యసభకూ పంపింది. తాజాగా పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే పార్లమెంటరీ బోర్డులోకి ఆయన్ను తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యం, సామాజిక సమీకరణాల కోణంలో కమలదళం ఆయన్ను వ్యూహాత్మకంగానే బోర్డులోకి తీసుకుందని పార్టీ వర్గాల సమాచారం.

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్​కేసర్​కు చెందిన లక్ష్మణ్‌ రాష్ట్ర భాజపాలోని అత్యంత సీనియర్‌ నేతల్లో ఒకరు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ముషీరాబాద్‌ నియోజకవర్గం నుంచి 1999, 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. నగర భాజపా అధ్యక్షునిగా, జాతీయ కార్యదర్శిగా, రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించారు. శాసనసభలో భాజపా పక్ష నేతగానూ వ్యవహరించారు. ఆయన రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న సమయంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా రాష్ట్రంలో ఒక సీటుకే పరిమితమైనప్పటికీ, లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలుచుకుంది. అనంతరం బండి సంజయ్‌కి సారథ్య బాధ్యతలు అప్పగించిన అధినాయకత్వం.. ఆ తర్వాత కొద్ది నెలలకే లక్ష్మణ్‌కు ఓబీసీ మోర్చా జాతీయ బాధ్యతలు అప్పగించింది. గతంలో తెలంగాణ నుంచి బంగారు లక్ష్మణ్‌ జాతీయ అధ్యక్షుని హోదాలో పార్లమెంటరీ బోర్డులో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వెంకయ్యనాయుడు ఆ బోర్డులో స్థానం పొందారు. తెలంగాణ నుంచి బోర్డులో స్థానం పొందిన నేత కె.లక్ష్మణ్‌ ఒక్కరేనని పార్టీ వర్గాలు తెలిపాయి.

కార్యకర్తకు లభించిన గౌరవం ఇది..:పార్లమెంటరీ బోర్డులోకి తనను తీసుకోవడాన్ని కార్యకర్తకు పార్టీ ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నానని లక్ష్మణ్‌ పేర్కొన్నారు. నియామక నిర్ణయం అనంతరం ఆయన ‘ఈనాడు-ఈటీవీ భారత్​’తో మాట్లాడారు. ‘పార్టీ నాయకత్వం దక్షిణాదిపై, మరీ ముఖ్యంగా తెలంగాణపై దృష్టి సారించింది. అందులో భాగంగానే నాకు ఈ అవకాశం కల్పించినట్లు భావిస్తున్నానని’ ఆయన తెలిపారు.

బండి సంజయ్‌ హర్షం..:పార్లమెంటరీ బోర్డులో లక్ష్మణ్‌కు చోటు కల్పించడం పట్ల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో కీలక కమిటీల్లో తెలంగాణ బిడ్డకు అవకాశం దక్కడం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవమని తెలిపారు.

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details