రాష్ట్రంలో ఆలయాల్లో విగ్రహాలపై వరుసగా జరుగుతున్న దాడులకు నిరసనగా పలు జిల్లాల్లో.. భాజపా ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు.
గుంటూరులో
ఆలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ.. గుంటూరు జిల్లాలో భాజపా మహిళా మోర్చా సభ్యులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. గుంటూరు శంకర్ విలాస్ కూడలి వద్ద రహదారిపై బైఠాయించి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతుంటే.. వాటిని నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు శ్రీదేవి విమర్శించారు. దేవాలయాలకు రక్షణ కల్పించలేని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో క్రైస్తవ రాజ్యం కొనసాగించే దిశగా.. వైకాపా ప్రభుత్వం అడుగులు వేస్తోందని.. భాజపా జిల్లా అధ్యక్షడు పాటిబండ్ల రామకృష్ణ అన్నారు. రామతీర్థంలో ఘటన మరువక ముందే కర్నూలులో మరో ఘటన జరగడం బాధాకరమన్నారు. హిందూ దేవాలయాలపైన దాడులు చూస్తుంటే.. రాష్ట్రంలో క్రైస్తవ పాలనా సాగుతున్నట్లు అనిపిస్తోందన్నారు.
నెల్లూరులో
దేవాలయాలు, భగవంతుని విగ్రహాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా.. నెల్లూరులో విశ్వహిందూ పరిషత్, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వరుసగా దాడులు జరుగుతున్నా.. ప్రభుత్వం ఏమిపట్టనట్లు వ్యవహరించడం దారుణమని వారు మండిపడ్డారు. అంతర్వేదిలో రథం దగ్ధం చేసిన వారిపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించకుంటే పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు.