ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మునుగోడు ఉప ఎన్నిక.. దత్తత నీదా-నాదా 'సై' అంటున్న ప్రధాన పార్టీలు - మునుగోడు ఉపపోరు

Parties on Munugode Adoption: ఎన్నికలు వచ్చాయంటే చాలు.. పార్టీలు అస్త్రశస్త్రాల్ని ప్రయోగిస్తాయి. హామీలు, అభివృద్ధి నినాదాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఇందులో ఉప ఎన్నిక అయితే.. నియోజకవర్గాన్నే లక్ష్యంగా చేసుకుని హామీలిస్తాయి. ఇలానే ప్రస్తుతం మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలోనూ దత్తత రాజకీయం నడుస్తోంది. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని.. మునుగోడును దత్తత తీసుకుంటామని రేవంత్‌ ప్రకటిస్తే.. తెరాస అభ్యర్థిని గెలిపిస్తే మునుగోడును దత్తత తీసుకుంటామని కేటీఆర్​ సైతం హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి ఇప్పుడు గుర్తుకువచ్చిందా? అంటూ కేటీఆర్‌ హామీపై భాజపా విమర్శలు గుప్పించింది.

Parties on Munugode Adoption
Parties on Munugode Adoption

By

Published : Oct 14, 2022, 7:29 PM IST

Parties on Munugode Adoption: రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్‌గా ప్రచారం జరుగుతున్న తెలంగాణలోని మునుగోడు ఉపపోరును ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా గెలిచి అసెంబ్లీ సమరానికి ఆత్వవిశ్వాసంతో వెళ్లాలని తెరాస, కాంగ్రెస్‌, భాజపాలు రచించిన వ్యూహాలను అమల్లో పెట్టాయి. ముఖ్య నాయకుని నుంచి స్థానిక కార్యకర్త వరకు నియోజకవర్గంలోని ఊరూరును చుట్టేస్తున్నారు. గడపగడపకూ తిరుగుతూ తమ పార్టీకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.

ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని అస్త్రాలను ఉపయోగిస్తున్న పార్టీలు.. ఇప్పుడు అభివృద్ధి హామీని తెరపైకి తెచ్చాయి. మమ్మల్ని గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి మాదీ బాధ్యత అంటూ వాగ్దానాలు ఇస్తున్నాయి. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి వచ్చిన మంత్రి కేటీఆర్.. మునుగోడును దత్తత తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉప ఎన్నికలో తెరాసను గెలిపిస్తే.. అభివృద్ధికి నాదీ పూచీ అంటూ ప్రకటించారు. 3 నెలలకు ఒకసారి అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. జగదీశ్‌రెడ్డి సూర్యాపేటను ఎంత బాగుచేసుకున్నాడో నేను సిరిసిల్లను ఎంత బాగు చూసుకుంటున్నానో.. అలానే ఇద్దరం కలిసి మునుగోడు అభివృద్ధి బాధ్యత తీసుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

మునుగోడు సిట్టింగ్‌ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌ సైతం దత్తత హామీ ఇచ్చింది. స్వయంగా రోడ్‌షో ద్వారా పాల్వాయి స్రవంతికి మద్దతుగా ఊరూరా ప్రచారం చేస్తున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మునుగోడు అభివృద్ధికి నాదీ బాధ్యత అంటూ తెలిపారు. వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని.. నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటామని తెలిపారు. రాహుల్‌గాంధీని తీసుకువచ్చి అభివృద్ధి నిధులు మంజూరు చేయిస్తానని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.

మునుగోడు అభివృద్ధి కోసమే రాజీనామా చేసి భాజపాలో చేరానని చెబుతున్న రాజగోపాల్‌ రెడ్డి సైతం ఇదే వాణి వినిపిస్తున్నారు. నేరుగా దత్తత హామీ ఇవ్వకపోయినా.. రాష్ట్రప్రభుత్వం నుంచి అభివృద్ధి నిధులు మంజూరు చేయించేందుకు ఎన్నికల బరిలో దిగానని ఆది నుంచే ప్రధాన ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు. కేటీఆర్‌ దత్తత హామీలపైనా కమలనాథులు విమర్శలు గుప్పిస్తున్నారు. మునుగోడును దత్తత తీసుకుంటామన్న కేటీఆర్​కు ఇన్నేళ్ల తర్వాత ఈ ప్రాంత అభివృద్ధి గుర్తుకువచ్చిందా? అని భాజపా ఎమ్మెల్యే రఘునందన్​రావు ప్రశ్నించారు. ఈ హామీ ద్వారా మునుగోడు అభివృద్ధి జరగలేదని కేటీఆర్‌ ఒప్పుకున్నట్లే కదా అని వ్యాఖ్యానించారు.

అవినీతి ఆరోపణలు, కాంట్రాక్టులపై విమర్శలపై రాజకీయవేడి రాజుకున్న వేళ.. దత్తత నినాదాన్ని బలమైన అస్త్రంగా జనంలోకి తీసుకెళ్లాలని భావిస్తున్నాయి. తమ పార్టీ అభ్యర్థి గెలుపు ద్వారానే నియోజకవర్గం ప్రగతిపథంలోకి వెళ్తుందని చెప్పడం ద్వారా విజయం సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details