High Tension in GHMC Head Office: హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద భాజపా కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలని, ప్రజా సమస్యలు పరిష్కరించాలంటూ.. మేయర్ ఛాంబర్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేయటంతో ఉద్రిక్త వాతావరణం (BJP corporators besiege GHMC headquarters) ఏర్పడింది.
కౌన్సిల్ మీటింగ్ పెట్టాలని, కార్పొరేటర్ల ఫండ్ విడుదల చేయాలని భాజపా కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. 5 నెలల క్రితం వర్చువల్ మీటింగ్ పెట్టినా.. పనులు జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ మేయర్ ప్రజా సమస్యలను పట్టించుకోవట్లేదని కార్పొరేటర్లు నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానిక సమస్యలు పరిష్కరించాలని కోరినా ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తగు చర్యలు తీసుకోవాలని.. లేదంటే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.