ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అంతరించిపోతున్న పిచ్చుకలను కాపాడుతోన్న పక్షి ప్రేమికులు - Bird lovers guarding sparrows

పిచ్చుకలు!! చిన్నగా బొద్దుగా చిట్టి తోకతో ఒకప్పుడు ఉదయాన్నే కిచకిచమంటూ నిద్రలేపేవి. ఇంటి చూరులో వాసాలకు ఏర్పరచిన గూడులో నివాసముంటూ ఒంటరిగా ఉన్నా... మేమున్నామంటూ తోడునిలిచేవి. మారిన జీవనశైలి, పట్టణీకరణతో ఆ చిట్టిప్రాణులు అంతరించే దశకు చేరుకున్నాయి. ఈ ఉరుకుల పరుగుల జీవితంలోనూ కరీంనగర్‌లో కొందరు పక్షి ప్రేమికులు... పిచ్చుకలను కాపాడుకునేందుకు తమవంతు కృషి చేస్తున్నారు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా ఆ పక్షి ప్రేమికులపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

BIRDS DAY
BIRDS DAY

By

Published : Mar 20, 2021, 8:41 AM IST

అంతరించిపోతున్న పిచ్చుకలను కాపాడుతోన్న పక్షి ప్రేమికులు

గోధుమ వర్ణంలో చిట్టి చిట్టి పాదాలతో అందమైన పిచ్చుకలు... ఒకప్పుడు తెల్లవారితే కిచకిచమంటూ సందడి చేసేవి. పల్లెటూళ్లలో ఇంటి చూరులో, వాసాల్లో, కొన్ని చోట్ల ఇంటికి కట్టిన గుమ్మడికాయపైనే నివాసం ఏర్పర్చుకునేవి. ఉదయం, సాయంత్రం ఆహ్లాదాన్ని పంచేవి. తెలంగాణ సంస్కృతిలోనే పిచ్చుకలు ఒక భాగంగా ఉండేవి. ఒకప్పుడు ఇంటి వాసాలకే పిచ్చుకల కోసం గూళ్లు కట్టేవారు. గ్రామాల్లో ఇప్పటికీ దసరా పండగవేళ వరి పైరును తీసుకొచ్చి పక్షల కోసం గుమ్మాలకు కడతారు.

తమవంతు కృషి...

ప్రస్తుతం ఇళ్లన్నీ దాబాలుగా మారాయి. పట్టణీకరణ, కాలుష్యం, సెల్‌ఫోన్‌ టవర్ల నుంచి వెలువడే తరంగాలతో పిచ్చుకలు అంతరించే దశకు చేరుకున్నాయి. మానవుడి అభివృద్ధే పిచ్చుకలపై బ్రహ్మాస్త్రంగా మారింది. కృత్రిమ గూళ్లతో రక్షిస్తే వీటిజాతిని కాపాడుకోవచ్చంటున్న శాస్త్రవేత్తల పిలుపుతో కరీంనగర్‌లో కొంతమంది పక్షి ప్రేమికులు పిచ్చుకలను కాపాడుకునేందుకు తమవంతు కృషి చేస్తున్నారు.

పిచ్చుకల కిలకిలరావాలతో...

అంతర్జాలంతో పాటు పత్రికల్లో వచ్చిన సమాచారం ఆధారంగా... పిచ్చుకలను కాపాడుకోవాలన్న అభిప్రాయానికి వచ్చారు రమేశ్‌. పిచ్చుకల కిలకిలరావాలతో మేల్కొనే వీరి కుటుంబం... ఉదయమే వాటికోసం అవసరమైన ధాన్యం గింజలు, నీరు ఏర్పాటు చేయడంలో నిమగ్నమవుతుంది. ఇంటి ముందే ఊర పిచ్చుకల కోసం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించారు. రేకుల డబ్బాలనే వాటికి గూళ్లుగా మలిచి... ఎప్పటికీ వాటికి అక్కడ ధాన్యం దొరుకుతుందన్న భరోసా కల్పిస్తున్నారు.

తిండి, నీరు, గూడు...

మొదట్లో ఒకట్రెండు పిచ్చుకలు వచ్చేవని... ఇప్పుడు గుంపులు, గుంపులుగా వచ్చి కాలనీ మొత్తానికి ఆహ్లాదాన్ని పంచుతున్నాయని చెబుతున్నారు. ఉరుకులు పరుగుల జీవితంలో పిచ్చుకలను కాపాడుకోవడం సాధ్యమా అని ఆలోచించే కంటే ప్రతి ఒక్కరు తమ వంతు ప్రయత్నం చేయాలని రచయిత మాశెట్టి గోపాల్‌ సూచించారు. వాటికి గూడు, తిండి, నీరు కల్పిస్తే ప్రకృతికి ఎంతో మేలు చేసిన వారమవుతాయని చెబుతున్నారు.

ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ వాటిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిన బూనాలని పక్షి ప్రేమికులు పిలుపునిస్తున్నారు.

ఇదీ చదవండి:మల్లెంపూడి బాలుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details