Bill Gates - KTR Chat in Bio Asia 2022 : బయో ఆసియా-2022 అంతర్జాతీయ సదస్సులో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పాల్గొననున్నారు. దృశ్య మాధ్యమంలో ఈనెల 24 నుంచి జరిగే ఈ సదస్సులో ఆయనతో తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు చర్చాగోష్ఠి నిర్వహించనున్నారు. కరోనా మహమ్మారితో గత రెండేళ్ల ప్రపంచ అనుభవాలు, ఆరోగ్య పరిరక్షణలో కొత్త పోకడల వంటి అంశాలపై చర్చించనున్నారు. బిల్‌గేట్స్ బయో ఆసియా సదస్సులో పాల్గొననుండడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
Bill Gates in Bio Asia 2022 : ‘‘ బిల్‌గేట్స్‌తో చర్చాగోష్ఠి కోసం నేను ఉత్కంఠతో ఎదురుచూస్తున్నా. జీవశాస్త్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న పరిస్థితిపై గేట్స్‌తో ఆసక్తికరమైన చర్చ నిర్వహిస్తాం. సదస్సులో ప్రభావవంతమైన, దార్శనిక నేతలు పాల్గొంటున్నారు’’ అని వివరించారు. ఈ సదస్సులో జాన్సన్ అండ్ జాన్సన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అలెక్స్ గోర్క్సీ, మెడ్‌ట్రానిక్ సీఈవో జెఫ్ మార్తాలు సైతం ప్రసంగించనున్నారని జీవశాస్త్రాల సంచాలకుడు శక్తి నాగప్పన్ తెలిపారు.