ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 7, 2021, 9:01 AM IST

ETV Bharat / city

తెలంగాణ మావోయిస్టుల కేంద్రస్థానం బీజాపుర్‌!

చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం తరెంలో మావోయిస్టుల భీకర దాడి నేపథ్యంలో తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిఘా విస్తృతం చేశారు. మావోయిస్టు బెటాలియన్‌ సభ్యుడు దీపక్‌ నేతృత్వంలో ఇటీవలే కొత్తగా యాక్షన్‌ టీం ఏర్పాటు కావడంతో సరిహద్దు ప్రాంతాల్లో దుశ్చర్యకు పాల్పడే అవకాశముందని నిఘా విభాగం అనుమానిస్తోంది. వారు తరచుగా రాకపోకలు సాగించే ప్రాంతాలపై గట్టి నిఘా ఉంచడంతోపాటు సరిహద్దుల్లో కదలికల గురించి ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా గోదావరి నదిని దాటి తెలంగాణలోకి రాకపోకలు సాగించేందుకు అనువైన తీరప్రాంతాలను క్షుణ్నంగా పరిశీలిస్తుండటంతోపాటు రహదారుల్లో వాహన తనిఖీలను ముమ్మరం చేశారు.

maoists in telangana
chhattisgarh maoist bijapur

తెలంగాణ మావోయిస్టు రాష్ట్ర కమిటీ ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా కేంద్రంగానే కార్యకలాపాలు సాగిస్తున్నట్లు నిఘావర్గాలు గుర్తించాయి. గతంలో తెలంగాణలోనే ప్రాంతాలవారీగా దళాలుండేవి. అక్కడికి సమీపంలోని అటవీప్రాంతాల్లోనే మకాం వేసి కార్యకలాపాలు సాగించేవారు. నిర్బంధం పెరగడంతో ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యానికి తరలిన దళాలు.. అవసరాన్ని బట్టి నాటుపడవలు, ఫెర్రీల ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. బీజాపుర్‌ జిల్లాలో పట్టున్న కోమట్‌పల్లి, ధర్మారం, రాంపూర్‌, మల్లంపెంట, జబ్బగట్ట, మిన్‌గట్ట, సాక్లేర్‌, బట్టుం, గుండ్రాజుగు, తుమ్రెల్లు, పెద్దచందా, పామేడు, కిష్టారం తదితర ప్రాంతాల్లో తెలంగాణ కమిటీ నేతలు స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. సరిహద్దులోని భద్రాచలం జిల్లా చర్లకు అవతల తాలిపేరు నది మొదలుకొని బీజాపుర్‌లోని చింతవాగు మధ్యలో వీరు కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో స్థానికంగా పట్టు కలిగి ఉండటంతో రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌, తెలంగాణ పార్టీకి మార్గదర్శకత్వం వహించే పుల్లూరి ప్రసాదరావు అలియాస్‌ చంద్రన్న మొదలుకొని రాష్ట్రకమిటీ సభ్యులు కంకణాల రాజిరెడ్డి, మైలారపు అడెల్లు, కొయ్యడ సాంబయ్య తదితర అగ్రనేతలంతా అక్కడే ఉంటున్నట్లు గుర్తించారు. తాలిపేరు వాగుదాటి చర్ల ప్రాంతంలోకి, డోలిగుట్టల మీదుగా ఏటూరు నాగారం ప్రాంతంలోకి రాకపోకలు సాగిస్తున్నట్లు సమాచారం సేకరించారు.

అక్కడే కేంద్రకమిటీ?

కేంద్రకమిటీ అంతా దుర్భేద్యమైన అడవులున్న అబూజ్‌మడ్‌లో మకాం వేసినట్లు నిఘావర్గాల వద్ద సమాచారముంది. సుమారు 4,000 చదరపు కి.మీ. విస్తీర్ణం కలిగిన ఈ కొండల్లో అత్యధికం దట్టమైన అటవీప్రాంతమే. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపుర్‌, బీజాపుర్‌, దంతేవాడ జిల్లాలతో కూడిన ఈ దండకారణ్యం ఇప్పటికీ మావోయిస్టుల ఆధిపత్యంలోనే ఉండటం గమనార్హం. పొలిట్‌బ్యూరో సభ్యుడు గణపతి, కార్యదర్శి నంబాల కేశవరావు సహా అగ్రనేతలంతా అక్కడే తలదాచుకున్నట్లు నిఘావర్గాలు చెబుతున్నాయి.

ఇవీ చూడండి:2వేల మంది పోలీసులు మాపై దాడి: మావోయిస్టులు

ABOUT THE AUTHOR

...view details