Bidhar Gutka: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో బీదర్ గుట్కా గుప్పుమంటోంది. ఏటా రూ.వేల కోట్ల అక్రమ వ్యాపారం నడుస్తోంది. కర్ణాటక రాష్ట్రం బీదర్ శివారులోని నౌబాద్ ప్రతాప్‌నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో పాన్‌మసాలా తయారీ కర్మాగారాలను నెలకొల్పారు. వీటిల్లో కొన్నిచోట్ల గుట్టుగా గుట్కా ఉత్పత్తవుతోంది. ఈటీవీ భారత్ బీదర్ జిల్లా వెళ్లి పరిశీలించగా ఆసక్తికర విషయాలు దృష్టికొచ్చాయి. పొగాకు కలవకపోతే పాన్‌మసాలాగా.. కలిస్తే గుట్కా అని స్థూలంగా వ్యవహరిస్తారు. ఏపీ, తెలంగాణలలో 2013లోనే ఈ రెండింటిపై నిషేధం విధించారు.
పదుల సంఖ్యలో...
కర్ణాటకలో గుట్కాపై మాత్రమే ఉంది. అందుకని బీదర్ జిల్లాలో చాలాచోట్ల పాన్‌మసాలా తయారీ ముసుగులో గుట్కా ఉత్పత్తి చేస్తున్నారు. బీదర్‌లో పరిశీలించినప్పుడు అక్కడ పాన్‌మసాలా తయారుచేసే ఓ కర్మాగారం ప్రహరీని ఆనుకుని ఉన్న నాలుగు వాహనాల్లో మూడు తెలంగాణ రిజిస్ట్రేషన్‌తో ఉన్నవి కనిపించాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం అక్కడ తయారయ్యేది గుట్కా. దానిని తెచ్చేందుకు వెళ్లిన వాహనాలవి. అలాగే కొన్ని కర్మాగారాల వారు సరకును అక్కడే ఉన్న చిద్రీరోడ్, పాతబస్తీ చిత్తేఖానాల్లోని హోల్‌సేల్ దుకాణాలకు తరలిస్తున్నారు. చిత్తేఖానాలోని మెయిన్‌బజార్‌లో ఈదుకాణాలు పదుల సంఖ్యలో ఉన్నాయి.
పాత పరిచయంతో వెళితే అడిగినంత సరకు ఇస్తున్నారు. కొత్తవారు వెళితే మాత్రం నిశితంగా ఆరా తీస్తున్నారు. తెలంగాణ, ఆంధ్ర నుంచి వచ్చినట్లు అనుమానమొస్తే గుట్కా విక్రయించట్లేదని చెప్పేస్తున్నారు.
90 శాతం బీదర్ నుంచే...
తెలంగాణాలో దొరికే సరకులో దాదాపు 90శాతం బీదర్ జిల్లా నుంచే అక్రమంగా వస్తోందని అంచనా. హైదరాబాద్‌కు ఇది కేవలం 100 - 130 కి.మీ.ల దూరంలోనే ఉండటంతో తెలంగాణకు చెందిన అక్రమార్కుల కన్ను ఆ ప్రాంతంపై పడింది. నిత్యం అక్కడికి వెళ్లి గుట్టుగా సరకు తెస్తున్నారు. దీని కోసం కార్లు, వ్యాన్ల వంటి వాటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. రాత్రివేళ లోడ్ చేసుకొని తెల్లారేసరికల్లా గమ్యం చేరిపోతున్నారు. ప్రతీరోజు సుమారు 500 వాహనాలు తెలుగు రాష్ట్రాల్లోకి సరకును తీసుకెళ్తుంటాయని స్థానికులు తెలిపారు.
అక్కడ రూపాయిన్నర.. ఇక్కడ రూ.10-15
బీదర్‌లో హోల్‌సేల్‌గా గుట్కా ప్యాకెట్ ఒక్కోటి రూపాయిన్నరకే దొరుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో నిషేధం ఉండటానికి తోడు డిమాండ్ విపరీతంగా ఉండటంతో ఒక్కోటి రూ.10-15లకు విక్రయిస్తున్నారు. పాన్‌డబ్బాలు, కిరాణాదుకాణాలు, కూరగాయల షాపులు.. ఇలా తేడా లేకుండా అమ్మేస్తున్నారు. పోలీసులు అడపాదడపా దాడులు చేసి సరకును స్వాధీనం చేసుకుంటున్నా అది నామమాత్రమే.