ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'నాణ్యతలో రాజీ లేదు.. టీకా తీసుకున్నవారి ఆరోగ్య భద్రతే మాకు ముఖ్యం' - corona vaccination news

వ్యాక్సిన్ తీసుకొనే లబ్ధిదారుల ఆరోగ్య పరిరక్షణే ఎప్పటికీ తమ తొలి ప్రాధాన్యమని భారత్​ బయోటెక్​ స్పష్టం చేసింది. కొవాగ్జిన్​ నాణ్యతపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న విమర్శలను సంస్థ ఖండించింది. ఇలాంటి కథనాల వల్ల వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

8
భారత్​ బయోటెక్​

By

Published : Aug 5, 2021, 10:54 PM IST

కొవాగ్జిన్ నాణ్యతపై సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న తప్పుడు ప్రచారాలను భారత్ బయోటెక్ ఖండించింది. తమ ప్లాంట్​లో కొవాగ్జిన్ తయారీ దగ్గర్నుంచి సరఫరా వరకు వ్యాక్సిన్ నాణ్యతపై తాము ఎక్కడా రాజీపడబోమని స్పష్టం చేసింది. కొవాగ్జిన్ ప్రతి బ్యాచ్ 200కు పైగా క్వాలిటీ కంట్రోల్ పరీక్షలు దాటుకొని, సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీ ఆఫ్ ఇండియా అనుమతులు పొందిన తర్వాతే మార్కెట్లోకి విడుదల చేస్తామని భారత్ బయోటెక్ తెలిపింది.

హైదరాబాద్​లోని జీనోమ్​ ల్యాబ్ దగ్గర్నుంచి తమ తయారీ యూనిట్లైన కర్ణాటకలోని మాలూర్, గుజరాత్​లోని అంకలేశ్వర్​లోనూ గ్లోబల్ తయారీ ప్రమాణాలు పాటిస్తున్నామని కంపెనీ పేర్కొంది. భారత్ బయోటెక్​కు టీకాల అభివృద్ధిలో సుధీర్ఘ అనుభవం, గ్లోబల్​గా వందల కోట్ల వ్యాక్సిన్ల సరఫరా చేసిన గుర్తింపు ఉందని గుర్తుచేసింది. వ్యాక్సిన్ తీసుకొనే లబ్ధిదారుల ఆరోగ్య పరిరక్షణ ఎప్పటికీ తమ తొలి ప్రాధాన్యమని.. అందుకే వ్యాక్సిన్ విడుదలకు ముందే అన్ని రకాల భద్రతా చర్యలు, పలు రకాల క్లినికల్​ ట్రయల్స్​ నిర్వహించిన తర్వాతే జనబాహుల్యానికి అందుబాటులోకి తీసుకువస్తామని భారత్ బయోటెక్ పేర్కొంది.

ఇప్పటివరకు 70 మిలియన్ డోసుల కొవాగ్జిన్​ను సరఫరా చేసినట్లు తెలిపిన సంస్థ.. వ్యాక్సిన్ వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు జరిగినట్లు కేంద్రం నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని సగర్వంగా ప్రకటించింది. వ్యాక్సిన్ సమర్థతపై వార్తలు రాసే మీడియా సంస్థలు ఒకటికి పదిసార్లు సమాచారాన్ని నిర్ధరించుకోవాలని.. భారత్​ బయోటెక్​ సూచించింది. తప్పుడు కథనాల వల్ల వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. మహమ్మారి నుంచి సాధారణ జీవనం వైపు అడుగులు వేసే దేశ గమనాన్ని ఇది దెబ్బతీస్తుందని భారత్ బయోటెక్ విజ్ఞప్తి చేసింది.

ఇదీ చదవండి:

'అన్నీ పరిశీలించాకే కొవాగ్జిన్‌కు అనుమతి'

ABOUT THE AUTHOR

...view details