Bharat Biotech: టీబీ వ్యాక్సిన్ తయారీ ప్రయత్నాల్లో దిగ్గజ సంస్థ - భారత్ బయోటెక్ టీబీ వ్యాక్సిన్
Bharat Biotech: కరోనా వంటి ఎన్నో ప్రాణాంతక వ్యాధులకు టీకాలు తీసుకువచ్చిన భారత్ బయోటెక్ సంస్థ టీబీ వ్యాక్సిన్ ఆవిష్కరించే ప్రయత్నాల్లో నిమగ్నమైంది. స్పానిష్ సంస్థ బయోఫ్యాబ్రితో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుని.. (ఎంటీబీ వ్యాక్) యూనివర్సిటీ ఆఫ్ జరగోజా, ఐఏవీఐ (ఇంటర్నేషనల్ ఎయిడ్స్ వ్యాక్సిన్ ఇనీషియేటివ్), ట్యూబర్ క్యులోసిస్ వ్యాక్సిన్ ఇనీషియేటివ్ (టీబీవీఐ) సహకారంతో అభివృద్ధి చేస్తున్నారు.
Bharat Biotech
By
Published : Mar 17, 2022, 9:19 AM IST
Bharat Biotech: భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ టీబీ (క్షయవ్యాధి) టీకా ఆవిష్కరించే యత్నాల్లో నిమగ్నమైంది. ఇందుకోసం స్పానిష్ సంస్థ బయోఫ్యాబ్రితో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు రెండు సంస్థలు కలిసి టీబీ టీకాను ఆగ్నేయ ఆసియా, సబ్-సహారన్ ఆఫ్రికా దేశాల్లో పంపిణీ చేస్తాయి. ఈ టీకాను (ఎంటీబీ వ్యాక్) యూనివర్సిటీ ఆఫ్ జరగోజా, ఐఏవీఐ (ఇంటర్నేషనల్ ఎయిడ్స్ వ్యాక్సిన్ ఇనీషియేటివ్), ట్యూబర్ క్యులోసిస్ వ్యాక్సిన్ ఇనీషియేటివ్ (టీబీవీఐ) సహకారంతో అభివృద్ధి చేస్తున్నారు. భారత్ బయోటెక్, బయోఫ్యాబ్రి భాగస్వామ్యంతో టీబీ టీకాను, ఆ వ్యాధి అధికంగా కనిపిస్తున్న దేశాలకు అందుబాటులోకి తెచ్చే అవకాశం కనిపిస్తోంది.
‘ప్రపంచ వ్యాప్తంగా 20 శాతానికి పైగా ప్రజలు టీబీ బారిన పడుతున్నారు. ఎంతో వేగంగా వ్యాపించే ఈ వ్యాధికి టీకా సరైన పరిష్కారం. తద్వారా వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా ఉంటుంద’ని భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల అన్నారు. ఎంటీబీ వ్యాక్ మొదటి, రెండో దశ క్లినికల్ పరీక్షల్లో ఎంతో ఆసక్తికర ఫలితాలు సాధించినందున, దీన్ని ఎంచుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Bharat Biotech: ప్రజలకు అందుబాటు ధరలో టీబీ టీకా తీసుకురావాలని భావిస్తున్నామని, టీబీ అధికంగా కనిపిస్తున్న భారత్, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, పాకిస్థాన్‌తో పాటు దక్షిణాఫ్రికా దేశాలకు భారత్ బయోటెక్ భాగస్వామ్యంతో టీకా అందించే అవకాశం కలుగుతుందని బయోఫ్యాబ్రి సీఈవో ఎస్తెబన్ రోడ్రిగూజ్ వివరించారు.
సీఐఐ దక్షిణ ప్రాంత విభాగం ఛైర్‌పర్సన్‌గా సుచిత్ర ఎల్ల
భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) దక్షిణ ప్రాంత విభాగానికి ఛైర్‌పర్సన్‌గా భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్ల ఎన్నికయ్యారు. 2022-23 సంవత్సరానికి ఆమె ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు. గతంలో ఆమె సీఐఐ- ఆంధ్రప్రదేశ్ ఛైర్‌పర్సన్, సీఐఐ- దక్షిణ ప్రాంత డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. సీఐఐ జాతీయ కౌన్సిల్ సభ్యురాలిగా కూడా ఉన్నారు. సీఐఐ- దక్షిణ ప్రాంత విభాగానికి 2022-23 సంవత్సరానికి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా కమల్ బాలి ఎన్నికయ్యారు. ఆయన వోల్వో గ్రూపు ఇండియా ప్రెసిడెంట్- ఎండీగా పనిచేస్తున్నారు. గతంలో ఆయన సీఐఐ- కర్నాటక ఛైర్మన్‌గా వ్యవహరించారు.
పరిశోధనల్లో పోటీతత్వం పెరగాలి..
పరిశోధన, అభివృద్ధి రంగాల్లో పోటీతత్వం అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని సీఐఐ దక్షిణ ప్రాంత సహ వ్యవస్థాపకురాలు, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్ల స్పష్టం చేశారు. బుధవారం చెన్నైలోని ఓ హోటల్‌లో సీఐఐ (దక్షిణ ప్రాంతం) ఆధ్వర్యంలో ‘మారుతున్న ఆర్థిక విధానం’పై సమావేశం జరిగింది. ఇందులో ఆమె మాట్లాడారు. టాటా స్టీల్ వంటి పెద్ద సంస్థలు అందుబాటులో ఉన్న సాంకేతికతతోనే విజయవంతంగా ముందుకు సాగుతున్నాయని సీఐఐ అధ్యక్షుడు, టాటా స్టీల్ ఎండీ టీవీ నరేంద్రన్ తెలిపారు. సీఐఐ దక్షిణ ప్రాంత ఛైర్మన్, కేవిన్‌కేర్ లిమిటెడ్ సీఎండీ సీకే రంగనాథన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం వివిధ రంగాల్లో డిజిటల్ విప్లవం వస్తోందని తెలిపారు. జోహో కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీధర్ వెంబు మాట్లాడుతూ.. కొత్త సాంకేతిక యుగం మెయిన్ ఫ్రేం నుంచి మొబైల్ యుగానికి మారుతోందని తెలిపారు. సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ తదితరులు ఈ సమావేశంలో ప్రసంగించారు.