దేశంలో తొలి కొవిడ్ కేసు నమోదైన నాటి నుంచే పరిశోధనలు మొదలయ్యాయి. పరిశోధనల కోసం పుణేలోని వైరాలజీ ల్యాబ్ నుంచి నమూనాల్ని రోడ్డు మార్గంలో కార్లోనే శామీర్‌పేటలోని జీనోమ్ వ్యాలీకి తెచ్చాం. ఆరోజు నుంచి ల్యాబ్‌లో పరీక్షలు మొదలయ్యాయి. అక్కడ బయటి వాతావరణంలో గాలి కూడా పీల్చలేని పరిస్థితులుంటాయి. శాస్త్రవేత్తలు ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకొని గంటల తరబడి పనిచేశారు. ఏ టీకా అయినా బయటకు రావడానికి కనీసం 5 నుంచి 10 ఏళ్లు పడుతుంది. కొవాగ్జిన్ టీకాను ఏడాది లోపే తెచ్చాం. టీకా విషయంలో ఏ దేశ పౌరులు అనేది మేమెప్పుడూ చూడలేదు. ఏ వ్యాక్సిన్ అయినా అంతర్జాతీయ పౌరుల్ని దృష్టిలో పెట్టుకునే తయారీ, ఉత్పత్తి సాగుతుంది.
ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి ఒప్పించడమే మొదటి విజయం
ఏ మందు అయినా బయటికి రావాలంటే మనుషులు, జంతువులపై ప్రయోగాలు చేయాలి. కొవాగ్జిన్ తయారీలోనూ 3 దశల్లో 30 వేల మందిపై క్లినికల్ ట్రయల్‌్్స చేశాం. ముందుకొచ్చిన వాలంటీర్లకు ఎదురయ్యే సమస్యలు చెప్పాం. 50 శాతం ఇబ్బందులు ఎదురవుతాయని తెలియజేసి ఒప్పించడమే మొదటి విజయం. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా 30 వేల మంది ముందుకు రావడం గొప్ప విషయం. వారికి అన్నిరకాల భద్రతనిచ్చి.. కంటికి రెప్పలా కాపాడుతూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చాం.
కేంద్రం చెప్పాకే బూస్టర్ డోసుపై నిర్ణయం
కొవాగ్జినే కాదు ఏ టీకా కూడా వంద శాతం రక్షణ ఇవ్వదు. రెండు డోసులు పూర్తయితే ప్రమాదం ఉండదని చెప్పొచ్చు. ఇప్పుడు కొవాగ్జిన్ సామర్థ్యం 78 శాతం. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తే ఏడాదికోసారి బూస్టర్ డోసు అవసరం వస్తుంది. ప్రజలకు బూస్టర్ ఎప్పుడివ్వాలనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది.
యాంటీబాడీస్ పరీక్షించుకోవాలి
కొవాగ్జిన్ రెండు డోసులు తీసుకున్న 45 రోజుల్లో యాంటీబాడీస్ గరిష్ఠంగా ఉత్పత్తి అవుతున్నాయని గుర్తించాం. వాటి ఉత్పత్తి ఎక్కువ ఉంటే ప్రమాదం తప్పినట్లే. రక్త నమూనాల ద్వారా యాంటీబాడీస్ పరీక్ష చేయించుకోవాలి. కొవిడ్ బారిన పడిన వారు ఆర్‌టీపీసీఆర్‌లో నెగెటివ్ వచ్చిన 3 నెలల తర్వాత రెండో డోసు తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ మొదటి డోసుగా ఏ వ్యాక్సిన్ తీసుకున్నా అమెరికా వెళ్లే వారు అక్కడ జాన్సన్ అండ్ జాన్సన్‌కు చెందిన టీకా తీసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ అది ఒకే డోసు టీకా.