కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయాలన్న డిమాండుతో రైతు సంఘాలు మంగళవారం చేపట్టిన భారత్ బంద్ రాష్ట్రంలో ప్రశాంతంగా జరిగింది. కాంగ్రెస్, సీపీఎం, సీపీఐతో పాటు పలు ప్రజా, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున బంద్‌లో పాల్గొన్నాయి. ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం ఒంటిగంట వరకూ డిపోలకే పరిమితమయ్యాయి. పలుచోట్ల విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. చాలా చోట్ల ప్రభుత్వ కార్యాలయాలూ తెరుచుకోలేదు. అమరావతి రాజధాని పరిరక్షణ సమితి ఐకాస ప్రతినిధులు కూడా ఈ బంద్‌లో పాల్గొని... రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.
ఊరూవాడా నిరసనలు
విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండు ప్రధాన ద్వారం వద్ద సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, పి.మధు, ఏపీ పట్టణ పౌరసమాఖ్య రాష్ట్ర కన్వీనర్ బాబూరావు, తదితరులు పాల్గొని నిరసన తెలిపారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఉయ్యూరులో జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. హనుమాన్ జంక్షన్‌లో జరిగిన ప్రదర్శనలో సాగునీటి సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల గోపాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. జగ్గయ్యపేట మండలం గౌరవరంలో జరిగిన నిరసనల్లో మాజీ ఎమ్మెల్యే, తెదేపా జాతీయ కోశాధికారి శ్రీరామ్ రాజగోపాల్ పాల్గొన్నారు. విజయవాడ లెనిన్ సెంటర్‌లో వ్యవసాయ సంఘాల ఐకాస ఆధ్వర్యంలో వ్యవసాయ పనిముట్లతో వినూత్న నిరసన ప్రదర్శన జరిగింది.
కదలని బస్సులు
గుంటూరు ఎన్టీఆర్ బస్టాండు ఎదుట వామపక్షాలు, కాంగ్రెస్, ప్రజా, కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులు నిరసన తెలిపారు. జిల్లాలో 577 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రైవేటు బస్సులు, ఆటోల్ని అడ్డుకోవటంతో ప్రైవేటు రవాణా కూడా మధ్యాహ్నం వరకూ స్తంభించింది. నరసరావుపేటలో అఖిలపక్ష నేతలు బంద్‌లో పాల్గొన్న అనంతరం సబ్‌కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. మంగళగిరి, తాడేపల్లి, బాపట్ల, రొంపిచర్ల, పెదకాకాని, నకరికల్లు, పెదకూరపాడు, తెనాలి, దుగ్గిరాల, మేడికొండూరు, ఫిరంగిపురం, అచ్చంపేట, రేపల్లె, వట్టిచెరుకూరు, పిడుగురాళ్ల, వినుకొండలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో చేశారు.
ప్రకాశంలో భారీ ర్యాలీ
ప్రకాశం జిల్లా ఒంగోలు, చీరాల, మార్కాపురం తదితర ప్రాంతాల్లో రైతు సంఘాలతో కలిసి వామపక్షాలు నిరసన చేపట్టాయి. ఒంగోలులో కర్నూల్ రోడ్డు కూడలి నుంచి ప్రకాశం భవనం వరకు భారీ ర్యాలీ నిర్వహించాయి. జిల్లాలో పలు కార్యాలయాలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి.