తెలంగాణలోని భద్రాద్రిలో అత్యంత వైభవంగా నిర్వహించే ముక్కోటి ఏకాదశి వేడుకలకు ఆలయం ముస్తాబవుతోంది. సకల లోకాలను ఏలే భద్రాచల రామయ్య రోజుకు ఒక అవతారములో భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ఈనెల 15వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 4 వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. దక్షిణ భారతదేశంలోని రెండో అయోధ్యగా పేరొందిన ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం. సీతారాముల కల్యాణ మహోత్సవం తర్వాత అత్యంత వైభవంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలను నిర్వహిస్తారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి వల్ల ఉత్సవాలను పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది ఆలయం లోపల చిత్రకూట మండపంలో భక్తులకు రోజుకు ఒక అవతారంలో దర్శనమిస్తారు.
పుష్కరిణిలో తెప్పోత్సవం :
ఈనెల 15 నుంచి భక్తులకు పలు అవతారాల్లో భద్రాద్రి రామయ్య దర్శనమివ్వనున్నారు. తొమ్మిది రోజుల పాటు విభిన్న రూపాల్లో కనువిందు చేయనున్నారు. ఈనెల 24 న గోదావరి నదిలో నిర్వహించాల్సిన తెప్పోత్సవం నీళ్లు తక్కువగా ఉన్నందున ఆలయంలోని చిత్రకూట మండపం ఎదురుగా ఉన్న పుష్కరిణిలో ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో శివాజీ సూచించారు. ఈనెల 25వ తేదీన ఉదయం 5 గంటలకు ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారు ఉత్తరద్వారం ద్వారా భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఈవో తెలిపారు. ఈ ఏడాది కరోనా కారణంగా కేవలం 200 మంది వీఐపీలకు మాత్రమే ఉత్తర ద్వార దర్శనానికి అనుమతి ఉందని స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధి పనులకు 50 లక్షలతో టెండర్లు వేసినట్లు ఈవో వెల్లడించారు. ఆలయానికి రంగులు, విద్యుద్దీపాలంకరణ, ప్రధాన రహదారుల వెంట స్వాగత తోరణాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు శివాజీ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:తితిదే కీలక నిర్ణయం...పిల్లల నుంచి వృద్దుల వరకు అందరికీ దర్శనం