గోదావరి ఉగ్రరూపానికి విలవిలలాడుతున్న తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. మూడు దశాబ్దాల తర్వాత వచ్చిన భారీ వరద ప్రవాహంతో.. లోతట్టు ప్రాంతాలు వరదలోనే మగ్గుతున్నాయి. భద్రాచలంతో పాటు మణుగూరు, అశ్వాపురం, పినపాక, బూర్గంపాడు, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో.. జన జీవనం అస్తవ్యస్తమైంది. ప్రజా రవాణా, సమాచార వ్యవస్థలకు.. తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఇళ్లల్లోకి వరద చేరటంతో కట్టుబట్టలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ముంపు బాధితులు.. పునరావాస కేంద్రాలకు చేరారు.
భద్రాచలంలో దుర్భర పరిస్థితులు.. బిక్కుబిక్కుమంటున్న వరద బాధితులు - badrachalam floods latest news
వరద గుప్పిట చిక్కుకున్న భద్రాచలంలో.. దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. కట్టుబట్టలతో ఇళ్లను వీడి పునరావాస కేంద్రాలకు వచ్చిన బాధితులకు.. అక్కడి పరిస్థితులు మరింత వేదన కలిగిస్తున్నాయి. సరైన తిండి, సౌకర్యాల్లేక.. పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు వరద వచ్చినా.. తమ బతుకులు రోడ్డున పడుతున్నాయని.. కరకట్ట ఎత్తు పెంచి శాశ్వత పరిష్కారం కల్పించాలంటూ భద్రాచలంలో ఆందోళన చేపట్టారు.
కట్టుబట్టలతో వస్తే.. పునరావాస కేంద్రాల్లో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని వరద బాధితులు వాపోయారు. చిన్నా పెద్దా, ముసలి ముతకా నానా ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. బాధలు భరించలేక.. భద్రాచలంలో వరద బాధితులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. గోదావరి వరద వచ్చినప్పుడల్లా తమ బతుకులు ఆగమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రాలో పోలవరం ప్రాజెక్టు పూర్తైతే.. గోదావరిలో 60 అడుగుల వరకూ నీరు ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కరకట్ట ఎత్తు, పొడవు పెంచి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని.. నెల్లిపాక వరకూ పొడించాలని ముంపు బాధితులు డిమాండ్ చేశారు. తక్షణ పరిహారంతో పాటు పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలు, భోజన వసతి మెరుగుపరచాలని నినదించారు.
ఇవీ చూడండి..