తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సీపీఎం దిగ్గజ నేత సున్నం రాజయ్య కరోనాతో మృతి చెందారు. సున్నం రాజయ్య ఇద్దరు కుమారులు, అల్లుడికి కూడా కరోనా నిర్ధరణ అయింది. వారు ఏపీ తూర్పు గోదావరి జిల్లా బొమ్మూరులో చికిత్స పొందున్నారు.
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఎమ్మెల్యే ఏపీలోని వి.ఆర్.పురం మండలంలో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అక్కడ నెగిటివ్ వచ్చింది. ఆయన ఆరోగ్యం మెరుగవడం లేదని 2 రోజుల క్రితం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. సోమవారం సాయంత్రం ఆయనకు కరోనా పాజిటివ్ అని వైద్యులు నిర్ధరించారు. దీంతో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు వెళ్లాలని వైద్యులు సూచించారు.
అప్పటికే ఆయాసంతో బాధపడుతున్న సున్నం రాజయ్యను విజయవాడ తరలిస్తుండగా అర్ధరాత్రి 12 గంటల తర్వాత మృతిచెందారు. ఆయన పార్థివ దేహాన్ని తూర్పు గోదావరి జిల్లా వి.ఆర్.పురం మండలం సున్నా వారి గూడెం వద్దకు తీసుకువచ్చారు. త్వరగా అంత్యక్రియలు చేయాలని వైద్యులు తెలపడం వల్ల మంగళవారం ఉదయం ఏడు గంటలకు ఆ గ్రామంలోనే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.