కొవిడ్-19 కట్టడికి అంతర్జాలం, చరవాణి ముఖ్య ఆయుధాలుగా పని చేస్తున్నాయి. ఈ క్రమంలో.. అసత్యాలు అంతే త్వరగా విస్తరిస్తున్నాయి. అటువంటి వాటికి చెక్ పెట్టడానికే వినూత్న ఆలోచన చేస్తున్నారు అధికారులు. దక్షిణ కొరియా, చైనా, ఆస్ట్రేలియా దేశాల్లో కరోనా కట్టడికి సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో దోహదం చేసింది. మన వద్ద కూడా అలాంటి పరిజ్ఞానాన్ని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకోవడమే కాక.. జనం ఇళ్లల్లో నుంచి బయటకు రాకుండా ఎక్కడికక్కడ సేవలందుకునే దిశగా చేస్తున్న ప్రయత్నం అమరావతిలో ఇప్పటికే ఆరంభమైంది.
నోట్‌క్యామ్ యాప్
కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ సర్వే ప్రారంభించింది. సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య ఆరోగ్య శాఖ సర్వే నిర్వహిస్తోంది. నోట్‌క్యామ్ యాప్ ద్వారా.. కరోనా బాధితులను గుర్తించేందుకు పక్కాగా సర్వే జరుగుతోంది. జీపీఎస్ కెమెరాతో కూడిన ప్రాంత సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేయడం ఈ యాప్ ప్రత్యేకత. యాప్‌లో వివరాలు నమోదు చేస్తే క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎక్కడి నుంచైనా ఉన్నతాధికారులు తెలుసుకోవచ్చు.
వినూత్న ఆలోచనలు..సేవలు
విజయవాడ నగరపాలక సంస్థ ప్రజల సమస్యల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కారం చేసేందుకు ప్రజా ఫిర్యాదుల నెంబరు 103ని ఏర్పాటు చేసింది. చరవాణి ద్వారా కూడా పౌరసేవల్ని అందించే చర్యల్ని కొవిడ్ నేపథ్యంలో తీసుకుంది. 81819 60909 ఈ నెంబరుకు వాట్సాప్ లేదా టెలిగ్రామ్‌లో ఎటువంటి సమస్యపై అయినా ఫిర్యాదు చేయవచ్చు. సమస్యల్ని ఫోన్ ద్వారానే పరిష్కరిస్తున్నారు.
టోటల్ ఫ్రెష్ యాప్..
మంగళగిరి పురపాలక సంఘ కమిషనర్ హేమామాలిని కరోనా నేపథ్యంలో జన సమూహాల్ని నియంత్రించి ఇంటింటికి పౌరసేవలందించేందుకు వినూత్న ఆలోచన చేశారు. ‘‘టోటల్ ఫ్రెష్ యాప్’’ పేరుతో నూతన యాప్ అందుబాటులోకి తెచ్చారు. ఆరు ప్రధాన కూరగాయల మార్కెట్లకు సంబంధించిన వ్యాపారుల్ని అనుసంధానం చేశారు. కూరగాయలతోపాటు నిత్యావసర వస్తువులు అవసరమైనవారు ఫోన్‌చేస్తే చాలు ఇంటికే అవి అందేలా చర్యలు తీసుకున్నారు.