హంద్రీ-నీవా ప్రాజెక్టుతో పాటు గొల్లపల్లి రిజర్వాయర్ నమూనాల మార్పు వల్ల మిగిలిన సొమ్ము మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి కాకుండా కాంట్రాక్టర్లకు దక్కడమేంటి అని అసెంబ్లీ ప్రజా పద్దుల సంఘం (పీఏసీ) అభ్యంతరం చెప్పింది. ఇదే విషయమై తొలుత ఓ గుత్తేదారు లబ్ధి పొందగా, అతనిపై చర్యలు తీసుకోకపోవడంతో పాటు మరో గుత్తేదారుకు కూడా లబ్ధి చేకూర్చడంపై అధికారులను ప్రశ్నించింది. ‘సొరంగం పనుల్లో కాంట్రాక్టరుకు అదనపు చెల్లింపులపై ఆడిట్ విభాగం లేవనెత్తిన అభ్యంతరాన్ని సంబంధిత శాఖ కూడా అంగీకరించింది. సొమ్ము స్వాధీనానికి సిద్ధమైంది. దానిపై గుత్తేదారు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. బాధ్యులైన అధికారులపై ఎందుకు చర్య తీసుకోలేదు’ అని కమిటీ సభ్యులు ప్రశ్నించారు. మంగళవారం వెలగపూడిలోని అసెంబ్లీ కమిటీ హాలులో పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అధ్యక్షతన కమిటీ సమావేశమై వివిధ అంశాలపై సమీక్షించింది.
* హైటెన్షన్ విద్యుత్ వినియోగ ఛార్జీల విషయంలో సమన్వయలేమి వల్ల ఏపీసీపీడీసీఎల్‌కు రూ.14 కోట్లు అదనంగా ప్రభుత్వం చెల్లించాల్సి వచ్చిందని కమిటీ గుర్తించింది. అయితే, చెల్లింపులు ప్రభుత్వ సంస్థల మధ్యే అయినందున తప్పు పట్టలేదు. ‘వ్యవస్థలో లోపాలు, నివారించదగ్గ (అవైడబుల్) ఖర్చులపై దృష్టి పెట్టాలి’ అని సూచించింది.