ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగిన గృహ లబ్ధిదారులు - ఉచిత ఇళ్ల స్థలాలు

గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల జాబితాలో ఉన్న పేర్లను తొలగిస్తున్నారంటూ రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులు ఆందోళనలకు దిగుతున్నారు. స్థానిక కలెక్టరేట్లు, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన తమ పేర్లను తొలగిస్తూ అనర్హుల పేర్లను జాబితాలో చేర్చుతున్నారని ఆరోపిస్తున్నారు.

beneficiaries protset
beneficiaries protset

By

Published : Jul 6, 2020, 4:49 PM IST

Updated : Jul 6, 2020, 5:48 PM IST

తెదేపా ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన ఇళ్ల కేటాయింపులను నిలిపివేయటంపై లబ్ధిదారులు ఆందోళనలకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా గృహాల కోసం ఎదురుచూస్తున్న వారు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెదేపా ప్రభుత్వంలో మంజూరైన జీ ప్లస్ త్రీ ఇళ్లను రద్దు చేస్తున్నట్లు వాలంటీర్లు చెబుతున్నారని..., వేలాది రూపాయలు చెల్లించి గృహాలు కేటాయింపుల కోసం ఎదురుచూస్తుంటే...రద్దు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయమై స్థానిక అధికారులను లబ్ధిదారులు నిలదీస్తున్నారు.

  • జిల్లా కలెక్టర్ దృష్టికి

ప్రకాశం జిల్లా ఒంగోలు మండల కేంద్రంలో గత ప్రభుత్వంలో ఇళ్లు మంజూరైనా లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. కేటగిరీలను బట్టి కొంత మేర డబ్బులు చెల్లించామని... ఇప్పుడు గృహాలు రద్దు చేయడమేంటని నిలదీశారు. ప్రభుత్వం మారిన తరువాత ఇళ్ల కేటాయింపు జరపలేదని, పైగా తమను ఒక పార్టీ వారిగా ముద్రవేసి జాబితాల్లో తమ పేర్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. ఇదే విషయంపై జిల్లా కలెక్టర్ కార్యాలయం దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన అధికారులు... పేర్లు తొలగించబోమని... అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని సర్ది చెప్పారు. సంతమాగులూరు మండలం కొమ్మలపాడు గ్రామంలో ఇళ్ల స్థలాలు అనర్హులకు ఇస్తున్నారంటూ ఆరోపిస్తూ గ్రామస్థులు వీఆర్వోను నిలదీశారు. లాటరీ పద్ధతిలో పేర్లు ఖరారు చేసిన తర్వాత... అదనంగా మరో ఐదుగురి పేర్లను ఎలా చేర్చుతారని ప్రశ్నించారు. తహసీల్దార్​ విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

  • పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్​ వద్ద ధర్నా

ఉభయగోదావరి జిల్లాల్లోనూ ఇళ్ల పట్టాల పంపిణీలో రోజురోజుకూ ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. జిల్లా నలూమూలల నుంచి కలెక్టరేట్లకు వస్తున్న ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. మరికొందరూ అక్రమాలు జరిగాయంటూ ధర్నాలు చేపడుతున్నారు. ఇవాళ గణపవరం, దెందులూరు మండలాలకు చెందిన పలువురు కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. అర్హులైన వారికి ఇళ్లపట్టాలు ఇవ్వకుండా అనర్హులకు ఇస్తున్నారంటు.. నినాదాలు చేశారు. ఏ ఒక్కరికీ అన్యాయం జరిగినా సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు.

  • ట్యాంకు పైకి ఎక్కి ఆందోళన

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు మండలం ప్రొద్దుటూరు గ్రామ పరిధిలో ఇళ్ల స్థలాల కేటాయింపులో అవకతవకలు జరిగాయంటూ పలువురు ఆందోళనకు దిగారు. అర్హులైన ఏడుగురు యువకులు గ్రామ సచివాలయం ఎదురుగా ఉన్న మంచినీటి ట్యాంకుపైకి పెట్రోల్​ డబ్బాలతో వెళ్లారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాంటూ ఆందోళనకు దిగారు.

రాష్టవ్యాప్తంగా అనంతపురం, శ్రీకాకుళం, చిత్తూరు, గంటూరు, విశాఖపట్నం, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో లబ్ధిదారులు ఆందోళన బాట పడుతున్నారు.

ఇదీ చదవండి:మానవత్వం మాయం: కరోనాతో మరణం... జేసీబీతో ఖననం

Last Updated : Jul 6, 2020, 5:48 PM IST

ABOUT THE AUTHOR

...view details