Beer sales increased: తెలంగాణలో బీర్ల అమ్మకాలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. ఎండ వేడిమి అధికం కావడంతో బీర్ల వాడకం అనూహ్యంగా పెరుగుతోందని ఆబ్కారీ శాఖ అంచనా వేస్తోంది. వేసవి కాలం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు (42 రోజులు) మద్యం విక్రయాలను పరిశీలిస్తే.. 40.46 శాతం బీర్లు అధికంగా అమ్ముడుపోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతేడాది మార్చి 1 నుంచి ఏప్రిల్ 11 వరకు రూ.3,302.78 కోట్ల విలువైన బీరు, 3.56 కోట్ల లీటర్ల లిక్కర్ విక్రయాలు జరిగితే.. 2022 మార్చి 1 నుంచి ఏప్రిల్ 11 వరకు రూ.3,614.91 కోట్ల విలువైన బీరు, 3.59 కోట్ల లీటర్ల లిక్కర్ అమ్ముడుపోయింది.
లిక్కర్ తగ్గింది.. బీరు పెరిగింది..
ప్రస్తుతం పగటి పూట ఉష్ట్రోగ్రతలు భారీగా పెరుగుతుండటంతో బీరు అమ్మకాలు పెరుగుతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి 11 వరకు జరిగిన బీరు, లిక్కర్ అమ్మకాలను పరిశీలిస్తే.. 2021 ఏప్రిల్ నెలలో 11 రోజుల్లో 84.64 లక్షల లీటర్ల లిక్కర్, 1.11 కోట్ల లీటర్ల బీరు అమ్ముడు పోగా.. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 11 వరకు 74.94 లక్షల లీటర్ల లిక్కర్, 1.39 కోట్ల లీటర్ల బీరు అమ్ముడుపోయింది. దీనిని బట్టి గతేడాది కంటే ఈ సంవత్సరం లిక్కర్ అమ్మకాలు దాదాపు 10 లక్షల లీటర్లు తగ్గగా.. బీరు అమ్మకాలు 28 లక్షల లీటర్లు అధికమైనట్లు ఆబ్కారీ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి.