నేడే బీసీజీ నివేదిక... రాజధాని రైతుల్లో ఉత్కంఠ రాజధానిపై సాంకేతిక అంశాల అధ్యయనానికి ప్రభుత్వం నియమించిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇవాళ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఈ నివేదికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో మూడు రాజధానులు ఉండొచ్చంటూ ఇప్పటికే జీఎన్ రావు కమిటీ ఓ నివేదికను ఇచ్చింది. రాజధానిపై అధ్యయనానికి బీసీజీని కూడా ప్రభుత్వం నియమించటంతో ఈ కమిటీ ఇచ్చే నివేదిక కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది. ఈ నివేదిక వచ్చిన అనంతరం రెండు నివేదికలను హైపవర్ కమిటీ అధ్యయనం చేస్తుంది. 10 మంది మంత్రులు, అధికారులతో కూడిన హైపవర్ కమిటీ ఈ రెండు నివేదికల్ని అధ్యయనం చేసి మూడు వారాల్లోగా ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. హైపవర్ కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం ప్రభుత్వం రాజధాని తరలింపుపై ఓ నిర్ణయానికి రానుంది. ఈ నివేదికల ఆధారంగా జనవరి చివరి వారంలో.. శాసనసభలో రాజధాని తరలింపుపై కీలకమైన నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉగాది తర్వాత సచివాలయం తరలింపునకు సిద్ధం కావాల్సిందిగా అనధికారికంగానే ఉన్నతాధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
బీసీజీ మధ్యంతర నివేదికలోనూ అదే ప్రస్తావన.!
ఇప్పటికే జీఎన్ రావు కమిటీ నివేదికను మంత్రివర్గ సమావేశంలో ఆమోదించి ప్రతిపాదనలపై చర్చించిన ప్రభుత్వం.. బీసీజీ ఇచ్చే పూర్తిస్థాయి నివేదిక కోసం ఎదురు చూస్తోంది. గతంలోనే బీసీజీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఓ మధ్యంతర నివేదికను సమర్పించినట్లు సమాచారం. ప్రస్తుతం పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు ఉన్న నగరంలోనే రాజధాని ఏర్పాటు చేయటానికి అనుకూలంగానే ఈ నివేదిక ఉన్నట్టు సమాచారం. గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ నిర్మాణం వల్ల భారీ ఎత్తున ఆర్థిక వనరులు సమకూర్చుకోవాల్సి ఉంటుందని బీసీజీ తన మధ్యంతర నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాన్ని రాజధానిగా ఏర్పాటు చేస్తే.. మరింత అభివృద్ధి సాధ్యం అవుతుందనేది బీసీజీ మధ్యంతర నివేదిక సారాంశమని తెలుస్తోంది.