తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థిని ప్రకటించిన రోజే మంత్రులు హరీష్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తల్లిలాంటి పార్టీకి ఈటల ద్రోహం చేశారని తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. తండ్రిలాంటి కేసీఆర్‌తో పాటు... నన్ను రారా అంటున్నాడని, తాము మాత్రం రాజేందర్ గారూ అని మాత్రమే సంబోధిస్తామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. రాజేందర్‌ను ఎమ్మెల్యే, మంత్రిని చేసింది కేసీఆరేనని అన్నారు. తల్లి లాంటి పార్టీని గుండెలమీద తన్నాడని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.
ఓటమి భయంతోనే...
ఓటమి భయంతోనే ఈటల అలా మాట్లాడుతున్నాడని... తాను ఓడిపోతున్నానని ఈటల ఒప్పుకున్నారని హరీశ్ రావు అన్నారు. సిరిసేడు గ్రామాన్ని దత్తత తీసుకున్న ఈటల ఒక్క పని చేయలేదని... నియోజకవర్గంలో 4 వేల ఇళ్లు నిర్మించాలని ముఖ్యమంత్రి మంజూరు చేస్తే ఒక్క ఇల్లు కూడ కట్టలేదని దుయ్యబట్టారు. ఈటల గెలిస్తే వ్యక్తిగా గెలుస్తాడు తప్ప ప్రజలుగా మనమంతా ఓడిపోతామన్నారు. మంత్రిగానే ఏమీ పనిచేయలేకపోయిన ఈటల ఇప్పుడు గెలిచి ఏం చేస్తాడో ప్రజలు ఆలోచించాలని హరీశ్ రావు అన్నారు.