బతుకమ్మ.. మహిళాశక్తిని ప్రతిబింబించే గౌరీదేవి ప్రతిరూపం. ఈమెను వివిధ రకాల పూల రూపంలో కొలుస్తాం. ఆ పూలన్నీ ఈ కాలంలో దొరికేవే. వీటిని ఉపయోగించడం వెనక ఆరోగ్య సూత్రాలూ ఉన్నాయి. అవేంటంటే...
తంగేడు: పసుపు రంగులో ఉండే ఈ పూలే కాదు.. మొక్కలోని ప్రతి భాగమూ ఔషధ గుణాలున్నదే. వీటిని మధుమేహం, అల్సర్, మలబద్ధక నివారణకే కాకుండా సౌందర్య ఉత్పత్తుల్లోనూ ఉపయోగిస్తారు.
బంతి:పండుగ, పూజ ఏదైనా ఈ పూలకే ప్రాధాన్యం. దీనిలో విటమిన్ సి, ఫ్లావనాయిడ్ గుణాలుంటాయి.
గునుగు:దీన్ని ప్రపంచవ్యాప్తంగా అలంకరణ కోసం ఉపయోగిస్తారు. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ డయాబెటిక్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలెక్కువ. దెబ్బలు, కాలిన గాయాలు, కడుపునొప్పి మొదలైనవాటికి మంచి మందు.
మందార:పువ్వే కాదు.. ఆకులు, కాండాల్లోనూ బోలెడు ఔషధ గుణాలు. విటమిన్ సి, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధిక మొత్తంలో ఉంటాయి. ఎక్కువగా సౌందర్య ఉత్పత్తుల్లో వినియోగిస్తారు.
గులాబీ:ఎండిన పూరేకలను తలనొప్పి చికిత్సకు ఉపయోగిస్తారు. రోజ్‌వాటర్ ముఖానికి తాజాదనాన్ని అందిస్తుంది. చర్మం కింద వాపు వంటివాటినీ అరికడుతుంది.