Endowment: దేవాదాయశాఖ కమిషనరేట్‌లోని ఓ అధికారి తీరు ఎప్పుడూ వివాదాస్పదమే. ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి. తాజాగా కొందరికి పదోన్నతులు కల్పించేందుకు బేరాలు ఆడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఉద్యోగులతో ఆ అధికారి మాట్లాడిన ఫోన్ సంభాషణల ఆడియోలు ఇపుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో కొన్ని పాతవికాగా, మరికొన్ని కొద్దిరోజుల కిందటివేనని తెలుస్తోంది.
అసలేం జరిగిందంటే.. కమిషనరేట్‌లో ఓ అధికారి.. ఆలయాల ఉద్యోగుల సర్వీసు అంశాల రూటింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు. వివిధ ఆలయాల్లో రికార్డ్ అసిస్టెంట్లకు జూనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పిస్తున్నామని, ఫైల్ సిద్ధమైందని ఆయన ఫోన్‌చేసి ఆయా ఉద్యోగులతో మాట్లాడారు. తనను కలవాలని, చేయి తడపాలంటూ పరోక్షంగా ప్రస్తావించారు. ఇలా కొంత ముట్టజెప్పిన వారికి తర్వాత పదోన్నతులు రాలేదు. దీనిపై వాళ్లు ప్రశ్నించడంతో.. ఆ అధికారే బాధితులపై విజయవాడలోని భవానీపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డబ్బులిచ్చిన బాధిత ఉద్యోగులకు పోలీసులు ఫోన్‌చేసి స్టేషన్‌కు రావాలంటూ హుకుం జారీ చేయడం గమనార్హం.