బార్బిక్యూ రైడ్ పేరుతో ప్రారంభమైన సరికొత్త ట్రెండ్ ఆహార ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కవలలైన ఇద్దరు యువకులు రోడ్డు పక్కనే నిప్పులపై కాల్చిన చికెన్ జాయింట్లు వేడివేడిగా అందిస్తున్నారు. ఆధునిక రీతిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌పై చేసిన ఈ ఏర్పాటు, ప్రతి ఒక్కరూ ఓసారి ఆగి తిని వెళ్లేలా నోరూరిస్తోంది.
ఆ రుచే వేరు...
జ్యూసీ చికెన్, స్మోకీ చికెన్, స్లో కుక్డ్ ఇలా పెద్దపెద్ద రెస్టారెంట్లలో మాత్రమే లభ్యమయ్యే మాంసాహార వంటకాలు నామమాత్రపు ధరకే బార్బిక్యూ రైడ్‌లో దొరుకుతాయి. స్పైసీ గ్రిల్డ్ పైనాపిల్ అంటూ శాఖాహార రుచులూ అందుబాటులో ఉన్నాయి. ముందే తగిన మసాలాలో నానబెట్టిన చికెన్ ముక్కలను కళ్ల ముందే బొగ్గులపై కాల్చి ఇస్తుంటే... ఆ రుచే వేరంటూ వినియోగదారులు లొట్టలేస్తూ లాగిస్తున్నారు.