Hyderabad Pub Case: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని కీలక ప్రాంతంలో సంచలనం రేపిన పబ్ డ్రగ్స్ కేసులో.. మాదక ద్రవ్యాల గుట్టు తెలుసుకునేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్లోని పుడింగ్ అండ్ మింక్ పబ్‌లో ఈ నెల 3న డ్రగ్స్ కలకలం రేగింది. అదే రోజు పబ్ నిర్వాహకులు అనిల్‌కుమార్, అభిషేక్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. చంచల్‌గూడ జైల్లో ఉన్న వీరిద్దరినీ కోర్టు అనుమతితో గురువారం నుంచి నాలుగు రోజులు కస్టడీకి తీసుకున్నారు. డ్రగ్స్ దందాపై తొలిరోజు పోలీసులు నిందితులపై ప్రశ్నల వర్షం కురిపించారు.
వారితోనూ సంబంధాలున్నాయా..?:పోలీసులు దాడి చేసినప్పుడు పబ్ మేనేజర్ అనిల్ కుమార్ ముందు కొకైన్ పొట్లాలు లభించాయి. అదేరోజు అతడిని ప్రశ్నించగా.. తనకేమీ తెలియదంటూ పోలీసులకు చెప్పాడు. పబ్ నిర్వాహకుడు అభిషేక్‌ను ప్రశ్నించినా.. తనకూ సమాచారం లేదన్నాడు. దీంతో పోలీసులు వారిద్దరి చరవాణులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపించారు. వారి కాల్‌డేటాను పరిశీలించగా.. గోవాలో జరిగిన పార్టీలకు తరచూ అభిషేక్ వెళ్లేవాడని తేలింది. పబ్ మేనేజర్ అనిల్ ఫోన్లోని వాట్సాప్ చాట్లు, మెయిల్స్‌ను పరిశీలించగా.. అందులో సంకేత పదాలు, సంక్షిప సందేశాలున్నాయి. వీటిల్లో కొన్ని డ్రగ్స్ సూచించే విధంగా ఉండడంతో పోలీసులు మరింత సమాచారం సేకరిస్తున్నారు. పబ్‌కు వచ్చే యువకులకు హాష్ ఆయిల్ సిగరెట్లు విక్రయిస్తున్నారన్న ఆధారాలు లభించడంతో గంజాయి స్మగ్లర్లతోనూ పబ్ నిర్వాహకులకు సంబంధాల కోణంలోనూ పరిశోధిస్తున్నారు.