Bandi Sanjay Letter to CM KCR: భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మరో లేఖాస్త్రం సంధించారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వారి న్యాయమైన 12 డిమాండ్లను వెంటనే ఆమోదించాలని కోరారు. విద్యార్థుల న్యాయమైన సమస్యలపై సీఎం నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.
జాతీయపార్టీ ఏర్పాటుపై పొలిటికల్ స్ట్రాటజిస్టులతో, తెలంగాణ ద్రోహులతో సమావేశం అవడానికి సీఎంకు సమయం ఉంటుంది.. కానీ గత ఆరు రోజులుగా ఆందోళన చేస్తున్న విద్యార్థుల సమస్యల పరిష్కారానికి మాత్రం కేసీఆర్‌కు టైం దొరకదని ఎద్దేవా చేశారు. కేటీఆర్ విదేశీ పర్యటనకు, కేసీఆర్ వ్యక్తిగత ప్రచారం కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తారు.. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం కోసం నిధులు ఉండవా అని ప్రశ్నించారు.
విద్యార్థుల డిమాండ్లను సిల్లీ డిమాండ్లుగా పేర్కొన్న మంత్రి సబితా బేషరతుగా వారికి క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. మంత్రులు, అధికారులు విద్యార్థులతో మైండ్ గేమ్ ఆడటం మానుకోవాలని హితవు పలికారు. గోబెల్స్ ప్రచారం చేస్తున్న మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి సమస్య పరిష్కారమైందని చెప్పడం ప్రభుత్వ దివాళకోరుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. మంత్రులు, అధికారులు, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. వారి సమస్యల పరిష్కారానికి తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలపై అన్ని విద్యార్థిసంఘాలతో ప్రభుత్వం ఒక సమావేశం ఏర్పాటు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.