ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జీహెచ్​ఎంసీ ఎన్నికల పోరులో 'సర్జికల్' హీట్

తెలంగాణలోని గ్రేటర్ ఎన్నికల పోరులో భాజపా ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గ్రేటర్‌లో భాజపా గెలిస్తే పాతబస్తీపై సర్జికల్‌ స్ట్రైక్ చేస్తామంటూ ఆయన వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. దీనిపై తెరాసతో పాటు ఎంఐఎం నేతలు మండిపడ్డారు.

bandi-sanjay-comments-on-minister-ktr
bandi-sanjay-comments-on-minister-ktr

By

Published : Nov 24, 2020, 11:51 PM IST

తెలంగాణలో జీహెచ్​ఎంసీ‌ ఎన్నికల సమరం రసవత్తరంగా మారింది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ చేసిన 'సర్జికల్‌ స్ట్రైక్' వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

ఓట్ల కోసం హైదరాబాదీలను బలి తీసుకుంటారా?: కేటీఆర్‌

తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ మంత్రి కేటీఆర్‌ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అదే సమయంలో కేంద్రంపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ ఆరేళ్లలో హైదరాబాద్‌కు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలంటూ భాజపా నేతలను నిలదీస్తున్నారు. భాజపా తరఫున బండి సంజయ్‌ తదితరులు అధికార తెరాసపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో బండి సంజయ్‌ తాజాగా చేసిన ఆరోపణలు దుమారం రేపాయి. గ్రేటర్‌లో భాజపా గెలిస్తే పాతబస్తీపై సర్జికల్‌ స్ట్రైక్ చేస్తామంటూ ఆయన వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. దీనిపై అటు తెరాసతో పాటు ఇటు ఎంఐఎం నేతలు మండిపడ్డారు. సంజయ్‌ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలతో పోలుస్తారా? హైదరాబాద్‌ ఏమైనా పాకిస్థాన్‌లో ఉందా? ఎందుకు సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తారని దుయ్యబట్టారు. పేదరికం, నిరుద్యోగంపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేయాలని హితవు పలికారు. నాలుగు ఓట్ల కోసం ఇంత చిల్లర రాజకీయమా అని ప్రశ్నించారు. ఓట్ల కోసం కోటిమంది హైదరాబాదీలను బలి తీసుకుంటారా? అని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

భారతీయులపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తారా?: అసదుద్దీన్‌

మరోవైపు సంజయ్‌ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ మండిపడ్డారు. పాతబస్తీలో ఉన్న ముస్లింలంతా ఈ దేశ పౌరులేనని.. భారతీయులపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తారా అని ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా భోలక్‌పూర్‌లో నిర్వహించిన ప్రచారంలో అసదుద్దీన్‌ మాట్లాడారు. సర్జికల్‌ స్ట్రైక్‌ చేయాలంటే లద్దాఖ్‌ సరిహద్దులో చైనాపై మెరుపుదాడి చేయాలని సవాల్‌ విసిరారు.

ABOUT THE AUTHOR

...view details