ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వాటర్ తో అమ్మాయి "మ్యాజిక్".. 150 మంది ఖతం!

ఆ త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ఓసారి ఇటు పిలవండి.. రవీంద్ర నారాయణ్ అనే క్యారెక్టర్.. పెన్సిల్ తో అరచేతికి బొక్క పెడితేనే వైలెంట్ అన్నాడు.. "వాడికి పువ్వుల్ని.. అమ్మాయిల్ని చూపించండ్రా" అని హితోపదేశం కూడా చేశాడు. మొత్తానికి.. అమ్మాయిలు లేలేత కుసుమాలనీ.. కరకుతనం.. గరుకుదనం.. వారి డీఎన్ఏలోనే లేదని తేల్చేశారు టాలీవుడ్ "గురూజీ"! ఇప్పుడు.. ఏ షూటింగులో, ఏ లొకేషన్లో ఉన్నాడోగానీ.. ఓసారి ఇటు పిల్చుకురండి.. ఈమె బయోపిక్ మొత్తం చూపించి.. తన కత్తి పదునేంటో ఓసారి తెలియచెప్పండి.. అప్పుడు, పైన రాసిన డైలాగ్ పై ఖచ్చితంగా ఒపీనియన్ మార్చుకుని తీరుతాడు..!!

baba anujka
baba anujka

By

Published : Sep 17, 2022, 3:18 PM IST

Updated : Sep 17, 2022, 5:52 PM IST

మనిషి మారుతాడు.. మారుతూనే ఉంటాడు.. ఏటికేడు.. రోజురోజుకూ.. క్షణక్షణానికీ మారిపోతుంటాడు. వారు ఎదుర్కొన్న పరిస్థితులు.. సమస్యలే.. అనునిత్యం వారి మార్గాన్ని నిర్దేశిస్తుంటాయి. ఈ మార్పునకు లింగ బేధం లేదు.. వయోబేధం అంతకన్నా లేదు.. కొందరు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తే.. మరికొందరు పాతాళానికి పడిపోతారు..! కొందరు ప్రేమ మూర్తులుగా మారితే.. ఇంకొందరు పాషాణ హృదయులుగా మిగిలిపోతారు.. కొందరు ప్రాణాలు పోస్తుంటే.. మరికొందరు నిర్ధాక్షిణ్యంగా గొంతు పిసికేస్తుంటారు..! ప్రపంచ చరిత్రలో ఇలాంటి నటోరియస్ క్రిమినల్స్ లిస్టు తీస్తే.. అందులో టాప్ లోనే ఉంటుంది.. అనడీ పిస్టోన్జా అలియాస్ బాబా అనుజ్కా!!

1838లో ఈ క్రిమినల్ ప్రాణం పోసుకుంది. ప్రస్తుత రొమేనియాలోని బనాట్ ప్రాంతంలో జన్మించింది. అయితే.. ఆమె జీవితం ఎక్కువగా.. ప్రస్తుత సెర్బియాలోని వోయివోడినా ప్రావిన్స్‌లోని యుగోస్లేవియన్ గ్రామమైన వ్లాదిమిరోవాక్‌తో ముడిపడి ఉంది. ఈమె గురించిన చరిత్ర పూర్తిస్థాయిలో అందుబాటులే లేకుండా పోయింది. ఉన్నదాని ప్రకారం చూస్తే.. పిస్టోన్జా ఒక ధనిక కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి పశువులను పెంచేవాడు. దీంతో.. ఆమె బాల్యం హ్యాపీగానే సాగిపోయింది. మంచి చదువులే చదివింది. కానీ.. 20 ఏళ్ల ప్రాయంలో మానసికంగా కోలుకోలేని దెబ్బ తగిలింది. ఒక ఆస్ట్రియన్ అధికారి ఆకర్షణకు లోనైంది. కానీ.. ఆమెకు సిఫిలిస్ ఇన్‌ఫెక్షన్‌ ఉన్న కారణంగా.. అతడు విడిచిపెట్టాడు. దీంతో.. భగ్నప్రేమికురాలిగా మారిపోయింది. మానసికంగా తీవ్రంగా కుంగిపోయింది. అలా.. మొత్తం మగ జాతిపైనే కోపం పెంచుకుంది.

ఆ తర్వాత కొన్నేళ్లపాటు బాహ్య ప్రపంచానికి కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. అనంతరం ఓ భూస్వామిని పెళ్లి చేసుకుంది. అతనికి అప్పటికే ఐదుగురు పిల్లలు ఉన్నారు. వయసులో అతను చాలా పెద్దవాడు అయినప్పటికీ.. వివాహం చేసుకుంది. దాదాపు 20 ఏళ్ల కాపురం తర్వాత భర్త మరణించాడు. ఐదుగురు పిల్లల్లో నలుగురు టీనేజ్ కు రాకుండానే చనిపోయారు. ముందు లవ్ ఫెయిల్యూర్.. ఆ తర్వాత భర్త మరణం.. వంటి కారణాలతోపాటు వ్యక్తిగత జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నదో తెలియదు. సీన్ కట్ చేస్తే.. పేరుమోసిన మంత్రగత్తెగా.. స్థానిక వైద్యురాలిగా మారిపోయింది. ఆ రోజుల్లోనే లక్షలాది రూపాయలు సంపాదించింది. క్లైంట్ల కోసం ఏకంగా ఏజెంట్లనే నియమించుకునే స్థాయికి చేరింది..!

భర్త మరణం తరువాత.. వ్లాదిమిరోవాక్‌ గ్రామంలోని తమ ఇంట్లో ఓ కెమికల్ ల్యాబ్ ఏర్పాటు చేసింది. అక్కడ విచిత్రమైన ప్రయోగాలు చేయడం మొదలు పెట్టింది. పెద్ద చదువులే చదివిన బాబా అనుజ్కాకు.. కెమిస్ట్రీ విభాగంలో మంచి పట్టే ఉంది. దాన్ని ఉపయోగించుకొని ఏవేవో మిశ్రమాలతో.. ఎవ్వరికీ తెలియని ప్రయోగాలు చేస్తూ ఉండేది. ఈ క్రమంలోనే తొలుత మూలికా వైద్యురాలిగా పేరుగాంచింది. చిన్నపాటి రోగాలకు మందులు ఇస్తూనే.. తన ప్రయోగాలు కొనసాగించింది.

కొన్నాళ్లకు ఓ విచిత్రమైన పదార్థాన్ని తయారు చేసింది. దాన్ని "మ్యాజిక్ వాటర్"గా పిలిచేవారు. ఈ పేరు చూసి ఏదో పాజిటివ్ డ్రింక్ అనుకోకండి. వంద శాతం విషం. కాకపోతే.. దీని స్పెషాలిటీ ఏమంటే.. డోస్ తీవ్రతను బట్టి 1 నుంచి 8 రోజుల్లో మనిషి చనిపోతాడు. చాలా తక్కువగా తీసుకుంటే.. అనారోగ్యానికి మాత్రమే గురవుతాడు. ఈ "మ్యాజిక్ వాటర్" తో.. ఎవ్వరూ ఊహించలేని దారుణాలకు పాల్పడింది అనుజ్కా. అప్పట్లో యువకులు సైన్యంలో బలవంతంగా పనిచేయాల్సి వచ్చేది. అలాంటి వారికి తక్కువ డోసులో దీన్ని ఇవ్వడం ద్వారా.. అనారోగ్యాలకు గురిచేసి, వారు ఇంటికి వెళ్లేందుకు సహకరించేది. ఆ తర్వాత రూట్ మార్చింది.

తమ భర్తలను చంపేయాలనుకునే ఆడవాళ్లకు.. ఈ "మ్యాజిక్ వాటర్" డోసు పెంచి ఇచ్చేది. వాళ్లు సైలెంట్ గా తీసుకెళ్లి.. భర్త తాగే నీళ్లలోనో.. తిండిలోనో కలిపేసేవారు. డోసును బట్టి వారు.. వారం లోపల చనిపోయేవారు. ఎలా మరణించారనే విషయం మాత్రం ఎవ్వరికీ తెలిసేది కాదు. ఇలాంటి వ్యాపారాన్ని గుట్టు చప్పుడు కాకుండా కొనసాగించింది అనుజ్కా. మరోవైపు మూలికా వైద్యాన్నీ నడిపించింది. దీంతో.. కొద్ది కాలంలోనే.. అనుజ్కా పాపులారిటీ విపరీతంగా పెరిగిపోయింది. 1920వ దశాబ్దం నాటికి ఈమె మ్యాజిక్ వాటర్ వ్యాపారం చాలా లాభదాయకంగా మారింది. డబ్బు భారీగా వచ్చిపడడం మొదలైంది. దీంతో.. ఏకంగా కన్సల్టెంట్లను నియమించుకుంది. మ్యాజిక్ వాటర్ అవసరమైన వాళ్లను వెతికి పట్టుకొని.. ఈమె వద్దకు తీసుకురావడమే వారి పని!

కేవలం వాటర్ తో.. మూలికలతో.. "వైద్యం" చేస్తున్న అనుజ్కాకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని స్థానికులు బలంగా నమ్మేవారు. ఇలా సాగుతుండగా.. 1924లో ఆమె రెగ్యులర్ కస్టమర్లలో ఒకరైన స్టానా మోమిరోవ్.. తన భర్త లాజర్ లుడోస్కీని చంపడానికి "మ్యాజిక్ వాటర్‌" తీసుకెళ్లింది. సక్సెస్ ఫుల్ గా "పని" కంప్లీట్ చేసింది. మరొకరిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఎవరికి స్పాట్ పెట్టిందంటే.. రెండో భర్త తండ్రికి.. అంటే మామగారిని లేపేయడానికి స్కెచ్ వేసింది. మరోసారి వాటర్ తెచ్చింది.. "మ్యాజిక్" చేసింది! కొద్ది గ్యాప్ లోనే ఇలా రెండు మరణాలు చోటు చేసుకోవడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. కానీ.. ఏమీ తేలలేదు. ఆ తర్వాత మరికొన్నాళ్లకు ఇలాంటి మరణమే సంభవించింది. దీంతో.. కేసును సీరియస్ గా ఇన్వెస్టిగేట్ చేశారు పోలీసులు. కుటుంబ సభ్యులను తమదైన రీతిలో ఇంటరాగేట్ చేయడంతో.. "మ్యాజిక్ వాటర్" సీక్రెట్ కక్కేశారు.

వెంటనే పోలీసులు.. మంత్రగత్తె.. కమ్ డాక్టర్.. కమ్ సీరియల్ కిల్లర్ అయిన అనుజ్కా వద్దకు వెళ్లారు. "ఏంటిది.. ఏం జరుగుతోంది ఇక్కడ?" అని ప్రశ్నించారు. "అవన్నీ వట్టి ఆరోపణలే.. నాకు, ఆ వాటర్ కు సంబంధమే లేదు" అని చెప్పింది అనుజ్కా. దీంతో.. ఆమె ల్యాబ్ లో దొరికిన ఆ "మ్యాజిక్ వాటర్" శాంపిల్స్ ను తీసుకెళ్లారు. ఆ నీళ్లను.. చనిపోయిన వారి శరీరంలోని శాంపిల్స్ తో పోల్చి చూశారు. ఇంకేముంది? సేమ్ టూ సేమ్ అని రిపోర్టు వచ్చింది.

బాబా అనుజ్కా

సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు.. దోషికి 15 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కానీ.. విషయం ఏమంటే.. అప్పుడు ఆమె వయసు 90 సంవత్సరాలు! వయసు పైబడిన కారణంగా.. కేవలం 8 ఏళ్లు జైల్లో ఉంచి, ఆ తర్వాత విడుదల చేశారు. పాపి చిరాయువు అన్నట్టుగా.. ఏకంగా వందేళ్లు బతికింది అనుజ్కా! సరిగ్గా వందో సంవత్సరంలో.. వ్లాదిమిరోవాక్‌లోని తన ఇంట్లోనే.. 1938 సెప్టెంబర్ 1వ తేదీన మరణించింది. కానీ.. మానవ చరిత్రలోనే అత్యంత దారుణమైన సీరియల్ కిల్లర్‌లలో ఒకరిగా అనుజ్కా నిలిచిపోయింది. ఈమె "మ్యాజిక్ వాటర్" కు బలైపోయిన వారి సంఖ్య ఎంతో తెలుసా? ఒకటీ.. రెండు కాదు.. ఏకంగా 150 మందికి పైగానే!

బాబా అనుజ్కా

ఏమండీ.. త్రివిక్రమ్ గారూ.. ఇప్పుడు చెప్పండి. వైలెన్స్ తగ్గాలంటే.. ఇంకా అమ్మాయిలనే చూడమంటారా..?? ఛాన్సుంటే ఈ సారి ఓ డైలాగ్ ఇలా రాయండి.. "అన్ని మంచినీళ్ల గ్లాసుల్లో నార్మల్ వాటరే ఉండదు.. కొన్నింట్లో "మ్యాజిక్ వాటర్" కూడా ఉంటుంది.. కాస్త చూస్కొని తాగండి బ్రో" అని...

వీటిపైనా ఓ క్లిక్కేయండి..

Last Updated : Sep 17, 2022, 5:52 PM IST

ABOUT THE AUTHOR

...view details