విఘ్నాలు లేకుండా చూసే వినాయకుడి ప్రసాదాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. హైదరాబాద్ గణేశ్ ఉత్సవాలు అనగానే ప్రతి ఒక్కరి మదిలో మెదిలేది బాలాపూర్ లడ్డూ. ఆ లడ్డూ దక్కించుకుంటే ఎన్నో శుభాలు జరుగుతాయన్న నమ్మకం, విశ్వాసం భక్తుల్లో ఉంది. వేలంలో ఈ లడ్డూను దక్కించుకుని ప్రసాదంగా స్వీకరిస్తే విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలు ఉంటాయని.. ఆ ప్రసాదాన్ని పొలాల్లో చల్లుకుంటే పంటల ఉత్పత్తి పెరిగి లాభాలు వస్తాయని, అనుకున్న వ్యాపారంలో ఆశించిన లాభాలు వస్తాయని ఇలా ఒక్కొక్క భక్తుడి విశ్వాసం ఒక్కోలా ఉంటుంది. ఇందువల్లే బాలాపూర్ లడ్డూకు అంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలోనే ఆ లడ్డూను దక్కించుకోడానికి ఏటికేడు పోటీ పెరుగుతోంది.
రూ.450తో మొదలై..
బాలాపూర్ గణేషుడికి ప్రతి ఏటా 21 కిలోల బరువు కలిగిన లడ్డూను తయారు చేస్తారు. 1980 సంవత్సరం నుంచి ఇలా 21 కిలోల లడ్డూను తయారు చేస్తున్నారు. అయితే 1994 నుంచి ఈ లడ్డూను వేలం వేసే సంప్రదాయం మొదలైంది. మొదటి సంవత్సరం 1994లో కొలను మోహన్ రెడ్డి రూ.450లకు లడ్డూను దక్కించుకున్నారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంగా ఈ లడ్డూ వేలం జరుగుతూ వస్తోంది. 2020లో కరోనా ప్రభావంతో లడ్డూ వేలం ఆగింది. ఆ లడ్డూను ఉత్సవ సమితి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేశారు.
పాత రికార్డు బ్రేక్..
బాలాపూర్ లడ్డూకు ఉన్న ప్రత్యేకత వల్ల లక్షలు పెట్టి దానిని దక్కించుకుంటున్నారు. ఆదివారం జరిగిన వేలంలో బాలాపూర్ గణేశ్ లడ్డూ రికార్డు స్థాయిలో ధర పలికి సరికొత్త రికార్డును సృష్టించింది. ఏకంగా రూ.18.90 లక్షలకు ఏపీలోని కడప జిల్లా ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ తన స్నేహితుడు మర్రి శశాంక్ రెడ్డితో కలిసి దక్కించుకున్నారు. 2019 కంటే లక్షా 30 వేలు అదనంగా పాడి.. రమేశ్ యాదవ్ బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. దీనిని ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. గతేడాది లడ్డూ వేలం పాటలో పాల్గొనాలని నిర్ణయించుకున్నప్పటికీ.. కరోనా వల్ల పాట రద్దు కావడంతో ఈ ఏడాది ప్రతిష్టాత్మకంగా తీసుకుని బాలాపూర్ లడ్డూను దక్కంచుకున్నట్లు ఆయన తెలిపారు.
1994 నుంచి 2021 వరకు బాలాపూర్ లడ్డూను ఎవరెవరు దక్కించుకున్నారో ఓసారి చూద్దాం..
- 1994- కొలను మోహన్‌రెడ్డి....రూ. 450
- 1995- కొలను మోహన్‌రెడ్డి.. రూ. 4,500
- 1996- కొలను కృష్ణారెడ్డి.. రూ. 18,000
- 1997- కొలను కృష్ణారెడ్డి... రూ. 28,000
- 1998- కొలను మోహన్‌రెడ్డి.. రూ. 51,000
- 1999- కల్లెం ప్రతాప్‌రెడ్డి.. రూ. 65,000
- 2000- కల్లెం అంజిరెడ్డి.. రూ.66,000
- 2001- జి. రఘునందన్‌చారి.. రూ. 85,000
- 2002- కందాడ మాధవరెడ్డి.. రూ.1,05,000
- 2003- చిగిరింత బాల్‌రెడ్డి.. రూ.1,55,000
- 2004- కొలను మోహన్‌రెడ్డి...రూ. 2,01,000
- 2005- ఇబ్రహీం శేఖర్... రూ.2,80,000
- 2006- చిగురింత తిరుపతిరెడ్డి..రూ.3,00,000
- 2007- రఘునందర్‌చారి.. రూ.4,15,000
- 2008- కొలను మోహన్‌రెడ్డి... రూ.5,07,000
- 2009- సరిత రూ.5,10,000
- 2010- కొడాలి శ్రీధర్‌బాబు..రూ.5,25,000
- 2011- కొలను బ్రదర్స్... రూ. 5,45,000
- 2012- పన్నాల గోవర్దన్‌రెడ్డి... రూ.7,50,000
- 2013- తీగల కృష్ణారెడ్డి... రూ.9,26,000
- 2014- సింగిరెడ్డి జైహింద్‌రెడ్డి...రూ.9,50,000
- 2015- కొలను మదన్ మోహన్‌రెడ్డి... రూ.10,32,000
- 2016- స్కైలాబ్‌రెడ్డి... రూ.14,65,000
- 2017- నాగం తిరుపతిరెడ్డి... రూ.15,60,000
- 2018- శ్రీనివాస్‌గుప్తా.. రూ.16,60,000
- 2019- కొలను రామిరెడ్డి... రూ.17,60,000
- 2020- కరోనా కారణంగా లడ్డూ వేలం రద్దు
- 2021- రమేశ్ యాదవ్... రూ. 18,90,000
ఇదీ చూడండి: