హైదరాబాద్ బాలానగర్ ఫ్లైఓవర్ (Balanagar Flyover) ఇవాళ్టి నుంచి నగర ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. మంత్రులు కేటీఆర్ (Minister Ktr), తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కృష్ణారావు, వివేక్, మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలానగర్ చౌరస్తాలో దుర్భరమైన ట్రాఫిక్ కష్టాలు ఉండేవని... అలాంటి ప్రాంతంలో పైవంతెన అందుబాటులోకి రావడం వల్ల ప్రజల చిరకాల కోరిక తీరిందని మంత్రి కేటీఆర్ అన్నారు.
మిగతావి కూడా...
జంట నగరాల్లో మొత్తం రూ.30 వేల కోట్లతో ఎస్‌ఆర్‌డీపీ(SRDP)లో పనులు చేపడుతున్నామని.. ఇందులో మొదటి విడతలో భాగంగా ఇప్పటికే పలు వంతెనలు, అండర్‌పాస్‌లు అందుబాటులోకి వచ్చాయన్నారు. మిగిలిన ఫ్లైఓవర్లు కూడా త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే రెండు స్కైవేలు సాధ్యం కావడం లేదని ఆరోపించారు. స్కై వేల కోసం అవసరమైన భూములను కేంద్రం ఇవ్వటం లేదని... దీంతో జూబ్లీ బస్టాండ్ నుంచి తుర్కపల్లి వరకు ప్రతిపాదించిన స్కైవే, ప్యాట్నీ నుంచి సుచిత్ర వరకు స్కైవేలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈ ప్రాంతాల్లో రక్షణ భూములు ఉండడం వల్ల కేంద్రం అనుమతి కోసం నాలుగేళ్ల కింద అడిగినా.. ఇప్పటికీ అనుమతి ఇవ్వలేదన్నారు.
సుచిత్ర వరకు స్కైవే...
కేంద్రం సహకరించకున్నా.... కొంచెం కుదించైనా... ప్యాట్నీ నుంచి సుచిత్ర వరకు స్కైవే నిర్మిస్తామని కేటీఆర్ అన్నారు. ఇవాళ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా బాలానగర్ ఫ్లైఓవర్‌కు జగ్జీవన్‌రామ్ వంతెనగా పేరు నిర్ణయిస్తున్నామని త్వరలో ఉత్తర్వులు జారీచేస్తామని మంత్రి ప్రకటించారు. బాచుపల్లి రహదారి కూడా త్వరలో విస్తరణ చేపడుతామని మంత్రి హమీ ఇచ్చారు. రూ. 385 కోట్ల వ్యయంతో అనుకున్నా... రూ. 250 కోట్లతో పనులు పూర్తయ్యాయని.. మిగతా నిధులతో ఇదే ప్రాంతంలో రోడ్డు విస్తరణ చేపడతామని చెప్పారు.
హైదరాబాద్ ప్రజలకు మరింత మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థను అందించడానికి రవాణా వ్యవస్థను సులభతరం చేయడానికి ఈ ఫ్లైఓవర్లు ఉపయోగపడతాయని నమ్ముతున్నా. నగరంలో జీహెచ్ఎంసీ, హెచ్‌ఎండీఏ మంచి కార్యక్రమాలు చేపడుతున్నాయి. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ బ్రిడ్జికి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయన పేరును నిర్ణయిస్తున్నాం. త్వరలో ఇందుకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు కూడా ఇస్తాం. మహాకవి ఓకాయన రాసినాడు.. తాజ్‌మహల్‌కు నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరని. ఎక్కడ పోయినా కూడా రాజకీయ నాయకులకే అగ్రతాంబూళం దక్కుతావుంటది. కానీ ఈ రోజు కార్మికులను గౌరవించుకోవాలనే సీఎం ఆలోచనల మేరకు ఈ ప్రాజెక్టులో రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్న శివమ్మ అనే కార్మికురాలితో ఈ బ్రిడ్జిని ప్రారంభించుకున్నాం.
-- కేటీఆర్, పురపాలక శాఖ మంత్రి