ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సర్కారు బడుల్లో 1 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం' - విద్యాశాఖ

విద్యారంగంలో సమూల మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి 1 నుంచి 8 తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. నిబంధనలు పాటించని కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ys jagan

By

Published : Oct 29, 2019, 9:23 PM IST

Updated : Oct 30, 2019, 12:03 AM IST

బాలకృష్ణన్ కమిటీతో ముఖ్యమంత్రి చర్చ

వచ్చే ఏడాది 1 నుంచి 8 తరగతి వరకూ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నట్టు సీఎం జగన్ వెల్లడించారు. దీనికి సంబంధించిన పాఠ్యప్రణాళికను సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ప్రారంభించిన నాడు-నేడు కార్యక్రమం కూడా కొనసాగాలని ఆయన స్పష్టం చేశారు. విద్యార్ధుల కోసం ఏర్పాటు చేసే ఫర్నిచర్ నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సీఎం సూచించారు.


నిబంధనలు పాటించకపోతే మూసేయండి
ప్రైవేటు పాఠశాలలు భారీగా ఫీజులు వసూలు చేస్తుండటంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా పాఠశాలల్లో నాణ్యత, సౌకర్యాలను కూడా పరిశీలించాలని స్పష్టం చేశారు. ప్రైవేటు జూనియర్ కళాశాల్లో సరైన సదుపాయాలు, ప్రమాణాలు లేకపోయినా, నిబంధనలు ఉల్లంఘించినా కేసులు నమోదు చేయాలని, తక్షణం మూసివేతకు ఆదేశాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేయాలని విద్యాశాఖను ఆయన ఆదేశించారు.

ఖాళీల భర్తీకి ఆదేశం
వ్యవసాయ కళాశాలకు 100 ఎకరాలు ఉంటేనే అనుమతి ఇవ్వాల్సి ఉందని.. ప్రస్తుతం ఉన్న కళాశాలలకు ఆ భూమి లేకున్నా ఇబ్బడి ముబ్బడిగా ఫీజులు వసూలు చేస్తుండటం ఏమిటని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. దీనిపై నియంత్రణ కమిషన్ వేయాలని ఆదేశించారు. కళాశాలల్లో నాణ్యతా ప్రమాణాలను నియంత్రణ చేయలేనప్పుడు వాటినెందుకు ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆధికారులను ఆరా తీశారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో నాణ్యత లేనప్పుడు వారిచ్చే సర్టిఫికెట్లకు విలువెక్కడిదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీచేయాలని స్పష్టం చేశారు. విద్యా సంస్కరణల కమిటీలో ఉన్న ప్రముఖులు, విద్యా వేత్తలు సిఫార్సులను ఇవ్వటంతో పాటు అమలులో కూడా భాగస్వాములు కావాలని సీఎం సూచించారు.

ఆ కళాశాలపై చర్యలు తీసుకోండి
విజయవాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఐఐటీ పరీక్షల కోసం ఐపీఎల్ తరహాలో అంతర్గత పరీక్షలు నిర్వహించి ఒత్తిడి తీసుకువస్తున్నారని ఫిర్యాదులు రావటంతో ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు సంస్థపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Last Updated : Oct 30, 2019, 12:03 AM IST

ABOUT THE AUTHOR

...view details