Uppalapati Sundar Naidu Passed Away: బాలాజీ హేచరీస్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త సుందరనాయుడు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. ఇవాళ సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు.శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి పార్థివ దేహాన్ని చిత్తూరుకు తరలిస్తారు. సొంత గ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు పశు వైద్యుడిగా వృత్తిని ప్రారంభించిన ఆయన.. కోళ్ల పరిశ్రమ అభివృద్ధికి అపార కృషి చేశారు. ఉమ్మడి ఏపీలో తొలితరం పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు. ఏపీ పౌల్ట్రీ సమాఖ్య అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. చిత్తూరులో బాలాజీ హేచరీస్ స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించారు. ఔత్సాహికులకు దార్శనికుడిగా నిలిచారు.
ఏపీ పౌల్ట్రీ
ఉప్పలపాటి సుందరనాయుడు(Sundar Naidu Uppalapati) 1936 జులై 1న ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం కంపలపల్లెలో జన్మించారు. నాన్న గోవిందునాయుడు, అమ్మ మంగమ్మలకు సుందరనాయుడుతో కలిపి మొత్తం ఐదుగురు సంతానం. అందరూ కలసి జీవించే ఉమ్మడి కుటుంబం వీరిది. మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సుందరనాయుడు టి.పుత్తూరు పాఠశాలలో ప్రాథమిక విద్య, అరగొండ జడ్పీ హైస్కూల్‌లో ఉన్నత పాఠశాల విద్య, తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత బొంబాయి వెటర్నరీ యూనివర్సిటీలో బీవీఎస్సీ పూర్తి చేశారు. చదువులో చురుగ్గా ఉండే సుందరనాయుడు.. తన గ్రామంలోని యువతను చైతన్య పరచడానికి నేతాజీ బాలానంద సంఘాన్ని స్థాపించి, గ్రంథాలయాన్ని, క్రీడా పరికరాలను సమకూర్చారు. గ్రామస్థుల సహకారంతో సంఘానికి శాశ్వత భవనాన్ని నిర్మించారు. విద్యార్థి దశ నుంచే సమాజ సేవా దృక్పథం, సమైక్య భావన సుందరనాయుడికి అలవడింది.వీరికి ఇద్దరు కుమార్తెలు.1964 డిసెంబరు 9న ఆయనకు సుజీవనతో వివాహం జరిగింది. శైలజ, నీరజ. శైలజా కిరణ్.. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు పెద్ద కోడలు, మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేటు లిమిటెడ్‌కు మేనేజింగ్ డైరెక్టరుగా వ్యవహరిస్తున్నారు.
బి.వి.రావుతో అనుబంధం: దేశ పౌల్ట్రీ రంగ మార్గదర్శకుడైన బి.వి.రావుతో సుందర నాయుడికి సన్నిహిత సంబంధం ఉండేది. పరిశ్రమ ప్రారంభ దశలో ఇతర వ్యాపారులు గుడ్ల ఉత్పత్తులపైనా, గుడ్ల ధరలపైనా తమ పట్టు బిగించి పరిశ్రమను తమ గుప్పిట్లో బంధించారు. రైతులకు రావాల్సిన లాభాలు దళారులుగా మారిన వ్యాపారుల పరమయ్యేవి. ఈ సమస్యను అధిగమించడానికి బి.వి.రావుతో కలిసి సుందర నాయుడు దేశం నలుమూలలా తిరిగారు. ‘నా గుడ్డు- నా జీవితం- నా ధర’ నినాదంతో విస్తృతంగా ప్రచారం చేశారు. దాని పర్యవసానంగా నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటైంది.